గతంలో తెలంగాణలో వ్యవసాయరంగాన్ని, రైతులను పట్టించుకొనే నాథుడేలేడని కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర సంస్కరణలు వ్యవసాయానికి ఊతమిచ్చాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాలోని ఖిలావరంగల్, సంగెం మండలాల్లోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదికలను ఆయన పరిశీలించారు. వ్యవసాయరంగంలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోన్న సీఎం కేసీఆర్, ఇప్పుడు రైతులను సంఘటితం చేయడంపై దృష్టి సారించారని, రైతులందరినీ ఒకేచోటకు చేర్చి సాగుపై చర్చించుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
ఇందులో భాగంగానే రైతు వేదికలను నిర్మిస్తున్నారన్నారు. యుద్ధప్రాతిపదికన రైతు వేదికలను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని దసరా నాటికి నియోజకవర్గంలోని అన్ని రైతు వేదికలను పూర్తి చేసి ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బిల్లా శ్రీకాంత్, పసునూరి స్వర్ణలత, జెడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ కందగట్ల కళావతి - నరహరి, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు: గంగుల