chilli farmers suicides: ఎర్రబంగారంగా పిలిచే మిర్చికి మార్కెట్లో అధిక ధర లభిస్తోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వండర్ హాట్ మిర్చి క్వింటాల్ 18వేల100 రూపాయల రికార్డు ధర పలికింది. ఇక యూస్ 341 రకం మిర్చి 18వేలు, తేజ రకం మిర్చి 16వేల 600 ధర పలుకుతుంది. మార్కెట్లో మిరపకు మంచి ధర రావడం రైతులకు ఆనందం కలిగిస్తున్నా ఈసారి కొత్త జాతి తామర పురుగు కారణంగా దిగుబడి తగ్గుతోంది. పంటకు ధర ఉండి దిగుబడి బాగుంటే రైతు లాభాలు కళ్లచూస్తాడు. కానీ దిగుబడి లేనప్పుడు ధర ఉన్నా ఉపయోగం లేదు. ప్రస్తుతం మిర్చి రైతు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో తామర పురుగు బెడద మిర్చి రైతులను కలవరపెడుతోంది. కాత పూత లేని పంటను చూసి రైతు దిగాలు చెందుతున్నాడు. కొన్ని చోట్ల కాయలు కాస్తున్నా అవి పూర్తిగా కాక ముందే రాలిపోతున్నాయి. ఎన్ని మందులు కొట్టినా ప్రయోజనం కనిపించట్లేదని రైతులు అంటున్నారు.
వారంలో ముగ్గురు రైతుల ఆత్మహత్య
farmers suicide: పంట తెగుళ్లబారిన పడడం, పెట్టుబడులతో అప్పుల పాలవడం కారణంగా వారం వ్యవధిలో ముగ్గురు మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తామర పురుగు, ఇతర తెగుళ్లతో పంట నాశనం కాగా.. అప్పులు తీర్చే మార్గం లేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లెలో రవీందర్ అనే మిర్చిరైతు చేను వద్దే పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.
కుమార్తె పెళ్లి చేయాలన్న దిగులుతో..
suicide in mulugu district: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాకలో హనుమయ్య అనే మిర్చి రైతు నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండెకరాల్లో మిర్చిపంట వేయగా.. తెగుళ్ల కారణంగా పంట పూర్తిగా నాశనమైంది. అప్పులు తీరే దారి లేకపోవడం.. కుమార్తె పెళ్లి ఎలా చేయాలన్న దిగులుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిరపతోటకు తామర పురుగు విపరీతంగా ఆశించడంతో పంట చేతికి రాదన్న వేదనతో ఈ నెల 12న మహబూబాబాద్ జిల్లా దూద్యాతండాలో బిక్కు అనే మిర్చి రైతు ఉరి వేసుకుని చనిపోయాడు. తెగుళ్ల బారిన పడిన పంటను రక్షించుకోలేక రైతులు ట్రాక్టర్లతో పంటను దున్నేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులే రాకపోగా పంటను తీసేందుకూ అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.