మన పెద్దల ద్వారా సంక్రమించిన ఆచార వ్యవహారాల వల్లే శరీర పటుత్వాన్ని కోల్పోకుండా ఉన్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హితబోధ చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడారు. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు,కారం,పసుపు,వెల్లుల్లి,అల్లం ఇతరత్రా పదార్థాల మూలంగానే కరోనా వ్యాధి దరి చేరలేదని... మన ఆచార వ్యవహారాలే మనకు శ్రీరామరక్ష అని మంత్రి ఎర్రబెల్లి అభివర్ణించారు. పూర్వం పెద్దవాళ్ళు తలకు రుమాలు మెడలో టవల్ వేసుకునే వారని... దాంతో అంటు వ్యాధులు దరిచేరేవి కాదని ఆయన గుర్తు చేశారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డవారే కరోనా కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.
సాంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించి గౌరవంతో పాటు ప్రాణాలను కూడా కాపాడుకునే సమయం వచ్చిందని.. అందరూ భారతీయ సంస్కృతి వైపు చూస్తున్నారని మంత్రి ప్రజలకు వివరించారు. ఏది ఏమైనా కరోనా నియంత్రణలో పూర్వపు పద్ధతులే శ్రీరామరక్ష అని మంత్రి ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.
ఇవీ చూడండి: మొత్తం 1044.. రాష్ట్రంలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు