అన్ని జాగ్రత్తలతో..
పలు షరతులతో వరంగల్‌లోని పలు పరిశ్రమలు తెరచుకున్నాయి. రాంపూర్ పారిశ్రామికవాడలో శుక్రవారం సుమారు 10 గ్రానైట్ పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. కార్మికులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఉన్నవారు కొందరు విధుల్లోకి వచ్చి యంత్రాలను శుభ్రం చేసుకొని వెళ్లారు. అనేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు నెమ్మదిగా తెరుచుకోనున్నాయి.
వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ ప్రత్యేక ఆర్థిక మండలిగా (సెజ్) ఉంది. ఇందులో వందకుపైగా పరిశ్రమలు కొలువుదీరాయి. నగరంలోని ములుగు రోడ్డులోని పారిశ్రామిక వాడలో టీఎస్‌ఐఐసీ పర్యవేక్షణలో మరో పది పరిశ్రమలు నడుస్తున్నాయి. ఇక జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్ రూరల్, ములుగు ప్రాంతాల్లో చిన్నా చితక వస్తువుల ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి.
నిబంధనలు అనుసరించి వాటిని ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. లోపల సామాజిక దూరం పాటించాలని, సుదూరాల నుంచి కార్మికులు ప్రజా రవాణాపై ఆధారపడకుండా పరిసరాల్లోనే నివసించే విధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి పనిచేయాలని పేర్కొంది. సాయంత్రం ఆరు వరకే పరిశ్రమలు నడవాలని, ఏడు గంటల వరకు కార్మికులు, సిబ్బంది ఇళ్లలోకి చేరుకునేలా పనివేళలు కచ్చితంగా పాటించాలని తెలిపింది.
రాష్ట్రాల సరిహద్దుల వద్ధ.
ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు, వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అవకాశం లభించింది. సొంత వాహనాల్లో నేరుగా వెళ్లి, సరైన ఆధారాలు చూపితే రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉన్న చెక్‌పోస్టుల్లో అనుమతి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి జిల్లా కేంద్రాల్లో పాసులు జారీ చేయడం లేదు. ఇలా చిక్కుకుపోయిన వారు తమ సొంతూళ్లకు వెళ్లే సడలింపు ఇవ్వడం ఎంతో మందికి ఉపశమనం కలుగుతుంది. ఇప్పటికే 13 మంది విద్యార్థులు మహారాష్ట్ర నుంచి వరంగల్‌కు వచ్చారు.
క్రమంగా గ్రీన్‌జోన్లోకి..
ఓరుగల్లులో కంటెయిన్‌మెంట్ ప్రాంతాలను క్రమంగా ఎత్తేస్తున్నారు. మొదట వరంగల్ రూరల్ జిల్లాలో తప్ప అన్ని జిల్లాల్లో కరోనా సోకింది. ప్రస్తుతం కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు ములుగు జిల్లా గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చింది. త్వరలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి వచ్చే అవకాశం ఉంది.
అర్బన్ జిల్లాలో తొలుత 27 కేసులు ఉండగా, ఇప్పటి వరకు 24 మంది కోలుకున్నారు. ముగ్గురు మాత్రమే గాంధీలో చికిత్స పొందుతున్నారు. అయిదు జిల్లాల్లో మొదలు 21 కంటెయిన్‌మెంటు జోన్లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 14కు తగ్గింది. ఇప్పుడు రెడ్‌జోన్‌లో వరంగల్ అర్బన్ ఉండగా ఆరెంజ్ జోన్‌లో జనగామ, భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి.