Kakatiya University Lands Occupied : వరంగల్ కమిషనరేట్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న కేయూసీ భూముల కబ్జా వ్యవహారం గతంలోనే మొదలైంది. లష్కర్‌సింగారం, కుమార్‌పల్లి, పలివేల్పుల, శివార్లతో కూడిన 612 ఎకరాల భూమిని ప్రభుత్వం కేయూసీకి అప్పగించింది. దీనికి నాలుగువైపులా ప్రహరీ లేనందున కబ్జా చేసేందుకు అవకాశాలు వచ్చాయి. ప్రభుత్వ మాజీ ఉద్యోగి, మరో రౌడీషీటర్ ఇద్దరు కలిసి భూముల్ని విక్రయించారు. కేయూసీ స్థలాలను ఆనుకొని ఉన్న సర్వే నంబర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించారు.
అప్పట్లోనే కేయూసీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒకరు ఈ భూముల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆక్రమణ దారులపై రౌడీషీట్ నమోదు చేశారు. ఆయన బదిలీపై వెళ్లడంతో.. కబ్జా దారులు మళ్లీ రెచ్చిపోయారు. అలా ఇప్పటివరకు 10 నుంచి12 ఎకరాలు అక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. ఆక్రమణకు గురైన ఆ భూముల రిజిస్ట్రేషన్ ధరనే సుమారు రూ.80 కోట్లు ఉంటుందని అంచనా.
పోలీసులే కబ్జాదారులుగా : హనుమకొండ నగరానకి సమీపంలోనే ఈ భూములపై.. ఇటీవల మరోసారి కొందరు కబ్జాకు యత్నించడంతో తేనెతుట్టె కదిలినట్లయింది. ఈవ్యవహారంపై తాజాగా వరంగల్ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దీంతో ఆక్రమణల్లో భాగస్వాములైన పోలీసుల పాత్ర తెరపైకి వచ్చింది. పోలీసులే అక్రమణలు ఆపాల్సిన ఉండే స్థానంలో ఉంటూ.. వారే ప్రభుత్వ భూములను ఆక్రమించడాన్ని ప్రస్తుత ఉన్నతాధికారిలో ఒకరు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఇంటెలిజెన్స్‌కు నివేదిక : కబ్జా వ్యవహారం లోటుపాటులపై అవగాహన ఉన్న పోలీసు అధికారులతో.. ఆ ఉన్నతాధికారి కొద్దిరోజుల కిందట సమీక్ష నిర్వహించారు. కేయూసీ భూముల కబ్జాదారులు 20 మంది వరకు ఉన్నారని ఉన్నతాధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటికే ఆ ప్రదేశాల్లో కొంత మంది సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటిని సొంతం చేసుకున్న జాబితాలో 6 నుంచి 9 మంది పోలీసులుండటం గమనర్హం. వారిపై కూపీలాగే దిశగా కార్యాచరణ ప్రారంభమైంది. ఇటీవల వారిపై ఇంటెలిజెన్స్‌కు నివేదిక సమర్పించారు.
ఈ జాబితాలో పోలీస్ ఉన్నతాధికారులో ఇద్దరు ఏసీపీలున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే పనిచేస్తున్న ఓ ఏసీపీ, రామగుండం కమిషనరేట్‌లో విధులు నిర్వరిస్తున్న మరో ఏసీపీకి ప్రమేయం ఉందని సమాచారం తెలుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ సీఐ పనిచేస్తుండగా.. మరణించిన మరో సీఐ పేరు జాబితాలో ఉంది. గతంలో వరంగల్‌లో పనిచేసి ప్రస్తుతం వేరేచోట ఉన్న ఆర్‌ఐ, మరో ఆర్‌ఎస్సై పాత్ర ఉన్నట్లు సమాచారం. వారుకాకుండా మరో ముగ్గురు పోలీసులు కాకతీయ క్యాంపస్ భూముల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: