Kaitex ready to launch : ఓరుగల్లుకే మణిహారంగా నిలిచే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో వస్త్ర రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్ధ.. కైటెక్స్ తన ఉత్పత్తులను ప్రారంభించేందుకు సన్నద్ధమైతోంది. జులై 7 2021లో కైటెక్స్ సంస్థ సర్కార్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. తమ యూనిట్‌ను వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో నెలకొల్పింది. కేరళకు చెందిన కైటెక్స్.. 1200 కోట్ల రూపాయలు వ్యయంతో 187 ఎకరాల్లో చిన్నపిల్లల దుస్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఇటీవలే నిర్మాణపనులు కూడా పూర్తికావడంతో.. ఇక ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. దేశంలోనే అతిపెద్దదిగా పేరోందిన వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో క్రమంగా కొత్త యూనిట్ల ఏర్పాటు వేగం పుంజుకుంది. 1350 ఎకరాల్లో విస్తరించిన ఈ జౌళి పార్క్ ను.. ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 అక్టోబర్‌లో ప్రారంభించారు. 567 కోట్లకుపైగా వెచ్చించి టీఎస్ఐఐసీ.. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చింది.
కరోనా మహమ్మారి కారణంగా తొలుత పనులు మందగించినా.. ఆ తరువాత వేగం పుంజుకున్నాయి. గణేషా ఎకోపెట్, ఎకోటెక్ కంపెనీలు 588 కోట్ల రూపాయలు వెచ్చించి యాభై ఎకరాల్లో రెండు యూనిట్లను ఇప్పటికే ప్రారంభిచింది. వాడిపారేసిన ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి వాటి నుంచి దారాన్ని ఈ సంస్ధలు తయారు చేస్తున్నాయి. పది రోజల క్రితమే దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ పరిశ్రమకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆ సంస్ధ ప్రతినిధులతో కలసి భూమి పూజ చేశారు.
జౌళి పార్క్‌లో 8 ఫ్యాక్టరీలను నిర్మించడానికి యంగ్ వన్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. మొత్తం 900 కోట్ల వ్యయంతో 261 ఎకరాల్లో యంగ్ వన్ ఫ్యాక్టరీలను నెలకొల్పబోతోంది. కైటెక్స్‌తో కలపి ఇప్పటి వరకూ వచ్చిన పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 60 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జౌళి పార్క్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్ధానికులకే పెద్ద పీట వేస్తామని.. మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక్కడ నెలకొల్పే సంస్ధలు ఉత్పత్తులు ప్రారంభిస్తే.. మేడిన్ వరంగల్, మేడిన్ తెలంగాణగా ఖ్యాతి గడిస్తామని చెప్పారు.
జౌళిపార్క్ నిర్మాణం కోసం భూములిచ్చిన వారికి.. వంద గజాల స్ధలం ఇవ్వాలని, ఆగస్టు 15 కల్లా పట్టాలివ్వాలని కేటీఆర్.. అధికారులను, స్ధానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఇక పార్క్‌లో నెలకొల్పే సంస్ధలు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తుండడం స్ధానికులను ఆనందానికి గురి చేస్తోంది. త్వరగా ఉపాధి దొరకుతుందని అనుకుంటున్నారు.
ఇవీ చదవండి: