రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి ఘటనలో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు వెలువరించిన తీర్పు... ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంచుతుందని వరంగల్ సీపీ ప్రమోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. మే నెల 21న ఈ ఘటన జరగగా... నేరం జరిగిన ఐదు మాసాల్లోనే కోర్టు తీర్పును వెలువరించిందని తెలిపారు.
గీసుకొండ మండలం గొర్రెకుంటలోని సాయిదత్త గన్నీ బ్యాగుల కంపెనీలో పనిచేసే తొమ్మిది మందికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చిన సంజయ్ కుమార్... అనంతరం వారిని సజీవంగా బావిలో తోసి హత్య చేసినట్టు సీపీ వివరించారు. ఈ కేసుకి సంబంధించి సీసీ కెమెరాలు, రక్తనమూనాలు, డీఎన్ఎ, పోస్ట్మార్టం నివేదికలు, ఇతర వైద్య పరీక్షలు, సాంకేతిక ఆధారాలతోపాటు 67 మంది సాక్షులను విచారించి పకడ్బందీగా కోర్టుకు ఆధారాలు సమర్పించినట్టు తెలిపారు.
25 రోజుల్లో 487 పేజీల చార్జీషీట్ని రూపొందించి కోర్టుకు సమర్పించడం జరిగిందని సీపీ పేర్కొన్నారు. కేసును చేధించి నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన ఈస్ట్ జోన్ ఇంఛార్జ్ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూర్ ఏసీపీ శ్యామ్ సుందర్, న్యాయవాది సత్యనారాయణ, టాస్క్ఫోర్స్, ఐటీకోర్, వివిధ విభాగాల సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
ఇదీ చూడండి : విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్