భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. జోరు వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దయింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ఏకధాటి వర్షం పడింది.
గ్రామీణ జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షం
వరంగల్ గ్రామీణ జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మండలాల్లోనూ నిరంతరంగా వాన కురుస్తోంది. ఖానాపూరం మండలంలో పాకాల సరస్సు 19 అడుగులకు చేరింది. మహబూబూబాద్ జిల్లా గార్ల మండలంలో పాకాల వాగు ఉద్ధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాలోనూ ముసురు పట్టింది. లక్నవరం, పాకాల, రామప్ప చెరువులు నిండుకుండల్లా మారాయి. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మోరంచ వాగు పొంగడంతో వెల్తుర్లపల్లి, అప్పయ్యపల్లి, బంగ్లపల్లి, గుర్రంపేట, నగరంపల్లి, కొండపల్లి, కొండాపూర్, సీతారాంపురం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల సరస్సుకు వరద నీరు భారీగా చేరింది. వర్ధన్నపేట ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో చెక్ డ్యామ్‌లు అలుగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆకేరు వాగు డ్రోన్ దృశ్యాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
జయశంకర్ భూపాలపల్లి గణపురం మండలంలో మోరంచ వాగు పొంగి వ్రవహిస్తుండడంతో... వెల్తుర్లపల్లి, అప్పయ్యపల్లి, బంగ్లపల్లి, గుర్రంపేట, నగరంపల్లి, కొండపల్లి, కొండాపూర్, సీతారాంపురం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నిండుకుండలా భద్రాకాళి జలాశయం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని చెరువులు, కుంటలు నిండుకున్నాయి. భద్రకాళి తాగునీటి జలాశయంతో పాటు కట్టమల్లన్న చెరువు, చిన్న వడ్డెపల్లి చెరువు, ఉరుసు రంగసముద్రం చెరువు మత్తడి పోతున్నాయి. బెస్తం చెరువు పూర్తిగా నిండగా గణేశ్ నగర్ కాలనీ ప్రధాన రహదారిపై వరద నీరు చేరి కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రకాళి చెరువు పొంగిపొర్లడంతో బ్రాహ్మణవాడ, కాపువాడ రహదారులపై వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలకు విఘాతం ఏర్పడింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రకాళి చెరువు మత్తడి పోస్తూ చూపరులను అమితంగా ఆకర్షిస్తుంది.
బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
ఉమ్మడి వరంగల్ జిల్లాల వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్ కాస్ట్ 2 ,3 గనుల్లోకి భారీగా వరద రావటంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది 6వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోగా.... మోరంచ వాగు పొంగిపోవటంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాలతో ముంపు ఇబ్బందులు తొలగించేందుకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు సర్వ సన్నద్ధమయ్యారు. ప్రజలకు సహాయం కోసం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న ప్రజలు టోల్‌ఫ్రీ నెంబర్లు 1800 425 1115, 1800 425 1980 ను సంప్రదించాలని సూచించారు. సహాయం కోసం 97019 99645, వాట్సప్ నం- 79971 00300 కు సంప్రదించాలని సూచించారు.