వరంగల్ గ్రామీణ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఆరు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారి జలకళ సంతరించుకున్నాయి. 5,700 ఎకరాలకు పైగా పొలాలు నీటమునిగాయి.
![heavy rains effect many places submerged under water in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8494008_wgl-2.jpg)
జోరు వానలకు వర్ధన్నపేటలోని ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోనారెడ్డి చెరువు భారీ ఎత్తున అలుగు పారుతోంది. చెరువు కట్ట తెగి కోనాపురం గ్రామం ముంపునకు గురైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
![heavy rains effect many places submerged under water in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8494008_wgl-1.jpg)
రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. పలు గ్రామాలకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నర్సంపేట పాకాల సరస్సు నిండు కుండలా మారింది. 30 అడుగుల నీటి మట్టం కలిగిన సరస్సులోకి వరదనీరు పూర్తి స్థాయిలో చేరి.. జలసిరిని సంతరించుకుంది. 5 అడుగుల ఎత్తు నుంచి అలుగుపారుతూ కనువిందు చేస్తోంది.
![heavy rains effect many places submerged under water in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8494008_wgl-4.jpg)
పరకాలలో కురుస్తున్న వర్షాలకు.. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. నాలాల నుంచి ప్రవహించాల్సిన వరదనీరు ఇళ్లలోకి చేరడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
![heavy rains effect many places submerged under water in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8494008_wgl-3.jpg)
జిల్లాలో సుమారు 5700 ఎకరాలకు పైగా పొలాలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.