తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ బావి ఘటన శవాల గుట్టును పోలీసులు ఛేదించారు. సోమవారం నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వరంగల్ పోలీసులు... 3రోజుల్లోనే బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ యాదవ్‌ను నిందితుడుగా తేల్చారు. సంజయ్... తొమ్మిది మందిని హత్య చేసి బావిలో వేసినట్లు.. వరంగల్ సీపీ రవీందర్ పేర్కొన్నారు.
మృతుల వివరాలు...
మూడేళ్ల బాలుడు బబ్లూ, మమ్మద్ మక్సూద్, నిషా ఆలమ్, బుష్రా, షాబాజ్, నుహేల్, శ్యామ్‌కుమార్ షా, శ్రీరామ్‌కుమార్ షా, షకీల్‌లను సంజయ్ హతమార్చాడు.
అసలు ఎవరీ సంజయ్...
నిందితుడు బిహార్‌లోని నుర్లపూర్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం జాన్‌పాకలో నివాసం ఉంటున్నట్లు సీపీ తెలిపారు. ఆరు బృందాలతో కేసును ఛేదించామని వివరించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మక్సూద్‌కు ఐదారేళ్ల క్రితం సంజయ్ పరిచయమయ్యారని సీపీ చెప్పారు.
మక్సూద్‌కి సంజయ్‌కు సంబంధం?
ఐదేళ్ల క్రితం మక్సూద్ సోదరి రఫిక బంగాల్ నుంచి వరంగల్‌కు ఉపాధి కోసం వచ్చింది. సంజయ్‌కుమార్ ఒంటరిగా ఉండేవాడు. సంజయ్‌కు డబ్బులు తీసుకుని రఫిక భోజనం ఏర్పాటు చేసేది. క్రమంగా వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. రఫిక కుమార్తెతో కూడా సంజయ్‌కుమార్ సన్నిహితంగా ఉండేవాడు. ఇదే విషయంపై రఫిక నిలదీసింది. పలుమార్లు సంజయ్‌కుమార్‌తో గొడవపడింది. రఫికను వివాహం చేసుకుంటానని నమ్మించినట్లు సంజయ్ విచారణలో తెలిపాడు. ఆ తర్వాత కూడా రఫిక కుమార్తెతో సన్నిహితంగా ఉండేవాడినని వివరించారు. సంజయ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫిక బెదిరించింది.
అడ్డు తొలగించుకునేందుకే..
రఫికను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సంజయ్... పెళ్లి విషయాన్ని బంధువులతో చర్చించేందుకు బంగాల్ వెళ్దామని నమ్మించాడు. మార్చి 6న గరీబ్ రథ్ రైలులో రాత్రి 10 గంటలకు రఫికను తీసుకుని బయలుదేరాడు. రైలులోనే రఫికకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను అందించాడు. ఆమె మత్తులోకి జారుకోగానే చున్నీతో గొంతు బిగించి చంపాడు. ఆ తర్వాత నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేశాడు. తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రఫిక చనిపోయిందని నిర్ధరించుకున్నాక రాజమహేంద్రవరంలో దిగి మరో రైలులో వరంగల్ చేరుకున్నాడు.
భయంతోనే... ఇలా...
బంగాల్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లిందని రఫిక పిల్లలను నమ్మించాడు. రఫిక బంధువుల ఇంట్లో లేదని తెలిసిన తర్వాత మక్సూద్ భార్య నిషా ఆలమ్ సంజయ్‌ను గట్టిగా నిలదీసింది. పోలీసులకు సమాచారం ఇస్తానని సంజయ్‌కుమార్‌ను బెదిరించింది. భయంతో నిషా ఆలమ్‌ను చంపాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. రఫిక మాదిరిగానే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి చంపాలనుకున్నాడు. ఆ పథకంతోనే మే 16-20 వరకు మక్సూద్ కుటుంబం పనిచేస్తున్న పరిశ్రమ చుట్టూ తిరిగాడు.
పథకం ప్రకారం...
మే 20న మక్సూద్ పెద్దకుమారుడు షాబాజ్ ఆలమ్ పుట్టినరోజని తెలుసుకున్నాడు. అదే రోజు నిషా ఆలమ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మే 18న మెడికల్ షాపులో 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మే 20న రాత్రి మక్సూద్ కుటుంబంతో చాలాసేపు ముచ్చటించాడు. మక్సూద్ కుటుంబం తయారు చేసిన భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. మక్సూద్ ఇంటి పైనే కిరాయికి ఉంటున్న బిహార్ యువకులు శ్యామ్, శ్రీరామ్‌ల భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. అందరూ నిద్రలోకి జారుకోగానే సాక్ష్యం దొరక్కుండా ఉండాలని అందరిని బావిలోకి విసిరాడు. అంతా చనిపోయారని నిర్ధరించుకున్నాక మక్సూద్ ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో సామగ్రి, సెల్‌ఫోన్లు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు.
6 బృందాలతో...
కేసు దర్యాప్తునకు 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. గోదాము, గొర్రెకుంట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించామని సీపీ తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు జాన్‌పాక్‌లోని ఆతని ఇంట్లోనే సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. విచారణలో నిందితుడు నేరాలు అంగీకరించినట్లు ప్రకటించారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మిగతా వాళ్లను చంపాడని సీపీ స్పష్టం చేశారు.
ఈనెల 21న బావిలో నుంచి 4 మృతదేహాలు వెలికితీశామని... ఈనెల 22న బావిలో నుంచి మరో 5 మృతదేహాలు వెలికితీసినట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు.
- సంబంధిత కథనాలు: ఆ బావిలో తొమ్మిది మృతదేహాలు..
- సంబంధిత కథనాలు: బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి
- సంబంధిత కథనాలు: ఆపరేషన్ బావి
- సంబంధిత కథనాలు: నువ్వైనా చెప్పవే! ఎలా జరిగిందో... ఎవరు చేశారో..?
- సంబంధిత కథనాలు: బావి ఘటనలో దర్యాప్తు ఇలా సాగింది..
- 9 కాదు 10 హత్యలు..!