వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో చేపట్టిన గ్రీన్ హైవే భూసేకరణ పనులను వెంటనే నిలిపివేయాలని అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో భూ సర్వే నిర్వహిస్తున్న అధికారులను అడ్డుకున్నారు. భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని హైవే పనుల పేరుతో.. గుంట భూమి లేకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ హైవే ఏనుగల్లు, చింతనెక్కొండ గ్రామాలమీదుగా వెళ్లుతుంది. ఈ క్రమంలో సుమారు 80ఎకరాల వ్యవసాయ భూములపై ప్రభావం చూపుతుందని అన్నదాతలు పేర్కొన్నారు. అధికారులు దొంగ చాటుగా పొల్లాలో సర్వేలు నిర్వహిస్తూన్నారని రైతులు వాపోయారు. తమ అంగీకారం లేకుండానే జాతీయ రహదారి సంస్థకు తప్పుడు లెక్కలు సమర్పించి భూములు లాక్కునే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూములను అన్యాయంగా లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం. పిల్లల చదువులు, పెళ్లిళ్లు వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. పొలాలకు ప్రత్యామ్నాయంగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. లేదా బహిరంగ మార్కెట్లో ఉన్న విలువ ప్రకారం డబ్బులు చెల్లిస్తేనే భూములు ఇస్తాం.
-బాధిత రైతులు
దీనిపై గతంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్కు రైతులు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. పరిహారం చెల్లించకుండా దౌర్జన్యం చేస్తే ప్రాణాలను సైతం లెక్క చేయమని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగం వదిలేసి... ఆ పంటతో లాభాలు గడిస్తున్న యువరైతు