Farmers protest in Warangal: వరంగల్ జిల్లాలో ప్రభుత్వం నిర్మించబోయే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకి వ్యతిరేకంగా రైతులు చేసిన ఆదోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమకొండ, ములుగు జాతీయ రహదారిపై అధిక సంఖ్యలో బైఠాయించిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు పంటలు పండే పచ్చని తమ పంట పొలాలను గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పేరుతో ప్రభుత్వం లాక్కుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రహదారి పేరుతో ప్రభుత్వం తమ భూములను లాక్కోవడం అన్యాయం అని రైతులు వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలని వారు మండిపడ్డారు. రైతులు నిరసనతో హైవేపై కిలో మీటర్ల పరిధిలో వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తోన్న రైతులను స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు తీవ్రంగా ప్రతిఘటించగా పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిసరాలు కాసేపు ఉద్రిక్తంగా మారాయి.
"ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది చట్ట వ్యతిరేక చర్య.. స్థానిక ఆర్డీఓ, కలెక్టర్ ప్రమేయం లేకుండా అధికారులు మా భూమిని వేలం వేయడానికి సిద్ధమైపోయారు. ఇది ఎంత వరకు సరైంది. మూడు పంటలు పండే తమ పంట పొలాలను భూసేకరణ పేరుతో లాక్కొవడం చాలా అన్యాయం. దీని మేము వ్యతిరేకిస్తున్నాం".- బాధిత రైతు
ఇవీ చదవండి: