వినాయక చవితి వచ్చిందంటే... ఆ సందడి మామూలుగా ఉండదు. నవరాత్రి ఉత్సవాల కోసం.... మండపాలు ఏర్పాటు చేయడం, విద్యుద్దీపకాంతులతో ఊరంతా కళకళలాడుతూ.. పండగ వాతావరణం నెలకొంటుంది. చవితి రోజు బొజ్జ గణపయ్యను తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజలు చేయడం... 9 రోజులు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలు... ప్రసాదాల వితరణ ఆద్యంతం కోలాహలంగా మారుతుంది.
ఊరికొక్క మట్టి గణపతి...
వినాయక చవితి పేరు మీద డీజేలు పెట్టడం... ఇతరత్ర కారణాలతో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో... జలకాలుష్యం ఏర్పడుతోంది. వీటన్నింటికి చెక్ పెట్టాలని భావించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు. ఊరికొక్క లంబోదరుడిని పెట్టి పూజలు చేయాలని నిర్ణయించారు.
జిల్లాలోని దుగ్గొండి మండలంలో దుగ్గొండి, బొబ్బరోనిపల్లె, రేఖంపల్లి గ్రామ పంచాయతీల్లో ఈ మేరకు తీర్మానించారు. మట్టితో చేసిన వినాయకుడిని పెట్టి.. ఊరంతా ఒక్కచోట చేరి పూజలు చేస్తామని గ్రామస్థులు పేర్కొన్నారు. జిల్లాలోని నల్లబెల్లి మండలం కొండైలుపల్లి వాసులు కూడా మట్టి గణపతి ఒక్కటే పెట్టాలని తీర్మానించారు.
పర్యావరణ హితం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం ధర్మారావుపేట, మహబూబూబాద్ జిల్లా లక్ష్మిపురం, జనగామ జిల్లాలోని పెద్దరాజుపేట, కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామాల్లో కూడా ఒక్క మట్టి బొజ్జ గణపయ్యను పూజించాలని ప్రజలు నిర్ణయించారు. పర్యావరణ హితమే కాకుండా... ఊరి ప్రజల ఐకమత్యం చాటడానికే ఈ విధంగా చేస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ భేటీ..