వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం పెద్దమ్మగడ్డ శివారు పాకాల ఆయకట్టు పొలాల్లో మొసలి కనిపించడంతో రైతులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. చౌడపు శంకరయ్య అనే రైతు పొలాలలో గడ్డి కోస్తుండగా... తన కాలికి ఏదో మెత్తగా తగిలింది అని తిరిగి చూశాడు. అది మొసలి అని గుర్తించి పొలం నుండి వెంటనే బయటకు పరుగులు తీసాడు. పక్కనే ఉన్న కొంతమంది రైతులను పిలిచి దాన్ని తాళ్లతో బంధించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఖానాపురం బీట్ ఆఫీసర్ ధర్మ... సిబ్బందితో మొసలి ఉన్న చోటికి చేరుకున్నారు. దానిని బంధించి వాహనంలో తీసుకెళ్లి పాకాల సరస్సులో వదిలేశారు. మొసళ్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కాల్వ ప్రవాహానికి వచ్చి ఎక్కువగా నీరు ఉన్న చోట చేపలను, కప్పలను తింటూ ఉంటాయని ఆయన తెలిపారు. వేసవికాలం కావడంతో నీరు లేక అవి పంటపొలాల్లోకి చేరి ఉండవచ్చని ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా