కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 20 నుంచి 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారని విమర్శించారు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో 250 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామని అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని కోరారు. నర్సంపేట పట్టణంలో ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి... అధిక ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: టీకా కోసం నిన్న సంకోచం.. నేడు ఆందోళన!