వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల 4 గొర్రెలు ఆంత్రాక్స్(anthrax symptoms) వ్యాధితో మృతి చెందడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. ఆ చుట్టుపక్కల వందలాది గొర్రెలు, మేకలకు టీకాలు వేయడం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడా బయటపడకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మేక లేదా గొర్రె మాంసం కొనేముందు.. ఆ జీవాలను పశువైద్యులు తనిఖీ చేశారో? లేదో నిర్ధారించుకోవాలని, వారు చెప్పింది నమ్మశక్యంగా లేకపోతే జీవాలను కోసిన ప్రాంతాన్ని ఒకసారి చూడాలని సూచించింది. జీవాలను కోసినప్పుడు వెలువడే రక్తం వెంటనే గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉంటే ఆ జీవానికి ఆంత్రాక్స్(anthrax symptoms) సోకినట్లు గుర్తించాలని తెలిపింది. వ్యాధిగ్రస్తమైన జీవాల మాంసాన్ని తినడం, తాకడం, అమ్మడం చేయవద్దని ప్రజలకు, గొర్రెల కాపరులకు, విక్రేతలకు స్పష్టం చేసింది.
ఏమిటీ ఆంత్రాక్స్..
పశువులు, గొర్రెలు, మేకలకు సోకే దొమ్మరోగం లేక నెత్తురెంక లేక రక్తపు దొమ్మ వ్యాధిని ఆంగ్లంలో ఆంత్రాక్స్‌గా పిలుస్తారు. జీవాలు తాగేనీరు, తినే గ్రాసం, ఇతర కీటకాల ద్వారా వాటి రక్తంలోకి ఈ వైరస్ ప్రవేశించి వేగంగా పెరిగి 2, 3 రోజుల్లోనే ప్రాణాన్ని బలిగొంటుంది. ఈ వ్యాధి సోకిన జీవాల కళేబరాలను ఊరికి దూరంగా 3 అడుగుల లోతు గొయ్యి తవ్వి సున్నం వేసి పూడ్చిపెట్టాలి. అవి చనిపోయిన ప్రాంతంలోని చెత్తనంతా తగలబెట్టేయాలి. కొన్నిసార్లు ఆయా జీవాలు ఆంత్రాక్స్‌తో(anthrax symptoms) చనిపోయిన విషయం తెలియక.. వాటిని కోసి మాంసం ఇతరులకు అమ్మడం లేదా కాపరులే వండుకుని తినడం జరుగుతోంది. వాటిని కోసి తినకపోయినా, కళేబరాలను నిర్లక్ష్యంగా వదిలేయడమూ ప్రమాదకరమే. కొందరు వాటి చర్మాన్ని ఓలిచి తీసుకుంటున్నారు. ఆ చర్మం ముట్టుకున్నవారికి, ఆ మాంసం తిన్న కాకులు, కుక్కలు, ఇతర పురుగుల ద్వారా ఆ వైరస్ గ్రామాల్లో ప్రజలకు సోకే అవకాశం ఉంది.
లక్షణాలిలా..
ఆంత్రాక్స్(anthrax symptoms) ఒకసారి ఒక ప్రాంతంలో వ్యాపిస్తే అది 60 ఏళ్ల పాటు వదలకుండా వెంటాడుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అదనపు సంచాలకుడు డాక్టర్ రాంచందర్ ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు చెప్పారు. ఈ వ్యాధితో చనిపోయిన జీవాల కళేబరాలను తగిన జాగ్రత్తలతో పూడ్చకుండా వదిలేస్తే వాటి నుంచి బయటికి వచ్చే సూక్ష్మక్రిములు అక్కడి నేలలో ఏళ్ల తరబడి పాతుకుపోతాయి. అక్కడి నీరు, గడ్డి, గాలి ద్వారా చుట్టుపక్కల మనుషులకు, పశువులకు వ్యాపిస్తూనే ఉంటాయి. ఒకసారి ఇవి పశువు లేదా మనిషి శరీరంలోకి ప్రవేశించి రక్తంలో కలిసిపోతే అవి వదిలే విషపదార్థాలతో ముక్కు, నోరు, మలద్వారం ద్వారా నల్లని రక్తం కారుతుంది. ఎక్కడైనా అకస్మాత్తుగా పశువులు, గొర్రెలు, మేకల నుంచి నల్లని రక్తం కారుతుంటే.. వాటికి ఆంత్రాక్స్ సోకిందని గుర్తించి వెంటనే పశువైద్యున్ని సంప్రదించాలి.
బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి
‘‘మాంసం కొనేటప్పుడు సదరు మేక లేదా గొర్రెను పశువైద్యుడు పరీక్షించారో? లేదో? వ్యాపారిని అడిగి తెలుసుకోవాలి. నిబంధనల ప్రకారం పశువైద్యులు పరీక్షించి ఆరోగ్యంగా ఉందని ధ్రువీకరించిన జీవాలనే కోసి మాంసాన్ని విక్రయించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో.. తనిఖీ చేశాకే కోయడానికి అనుమతిస్తారు. రోడ్ల పక్కన కోసి అమ్మే మాంసాన్ని కొనొద్దు. జీవాలను కోశాక.. వాటి శరీరాన్ని నేలపై పడకుండా గాలిలో వేలాడదీయాలి. నేలపై పెడితే వ్యాధికారక బ్యాక్టీరియా మాంసంలోకి చేరుతుంది. కనీసం వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి. సరిగా ఉడకకపోతే ఎట్టిపరిస్థితుల్లో తినరాదు’’ అని భారత మాంసం పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త బసవారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: anthrax symptoms: వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం