వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. మొత్తం 9,263 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో మూడో వార్డులో ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో తెరాస నుంచి కొండేటి సరిత, భాజపా తరఫున కొండేటి అనిత, కాంగ్రెస్ అభ్యర్థిగా కొండేటి మమత, స్వతంత్ర అభ్యర్థిగా కొండేటి శ్రీలత బరిలో ఉన్నారు. అయితే నలుగురూ మహిళలు కావడం... అందులోనూ అందరిదీ ఒకే ఇంటి పేరు కావడం... పేర్లు కూడా ఒకేలా ఉండటం వల్ల వీరికి పార్టీ గుర్తు మాత్రమే కీలకం కానుంది.
వర్ధన్నపేట మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత జరిగే మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడం వల్ల రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా సరే గెలవాలనే లక్ష్యంతో ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా మూడో వార్డులో ప్రచారం సాగిన తీరు అభ్యర్థుల గెలుపును నిర్ణయిస్తుంది. ఎవరైతే పార్టీ గుర్తు వార్డు ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్తారో వారే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం అభివృద్ధి పేరుతో ప్రచారం నిర్వహిస్తే మాత్రం ఓటమి తప్పదు అనే సంకేతాలు వార్డు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
ఇప్పటికే వర్ధన్నపేట పురపాలకలో ప్రచారం అంతిమ దశకు చేరుకుంది. కొండేటి ఇంటి పేరు అభ్యర్థులకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే గందరగోళ పరిస్థితిలో మూడో వార్డుకు చెందిన ప్రజలతోపాటు ఆయా రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ఇవీ చూడండి: వైద్య విద్యార్థి దారుణ హత్య