ఇసుక అక్రమ రవాణాపై సర్పంచులు అధికారు యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష సూచించారు. ఇసుక రీచ్ల వద్ద సాంకేతిక కమిటీ ద్వారా సరిహద్దులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇసుక రీచ్ల సహాయకులు పనితీరు సరిగా లేనందున 24 గంటలు రెవెన్యూ నిఘా ఉంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శాండ్ కమిటీ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఇసుక రీచ్లున్న గ్రామాల్లో తీర్మానాలు పంపితే ఇసుక కమిటీ నుంచి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇసుక రీచ్ల వద్ద సరిహద్దులను పిల్లర్లతో ఏర్పాటు చేయాలని రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమైన ఇసుక అంచనాలను రూపొందించి పంపితే రిజర్వులో ఉంచుతామని కలెక్టర్ వెల్లడించారు. వినియోగదారులకు నాణ్యమైన ఇసుక ఒక ట్రిప్పు మాత్రమే ఇవ్వాలని... అధికంగా ఇస్తే సహించేది లేదని పాలనాధికారి హెచ్చరించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా మైనింగ్ ఇన్ఛార్జ్ అధికారి విజయకుమార్, ఆర్డీవో అమరేందర్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్శాఖ అధికారులు, సర్పంచులు హాజరయ్యారు.