ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి కేసును పరీక్షించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కొవిడ్‌పై సమీక్షించారు. పాజిటివ్ వచ్చిన వారితో సంబంధం ఉన్న ప్రాథమిక కాంటాక్ట్స్ అందరిని పరీక్షించి, ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపించినట్లయితే తక్షణమే జిల్లా ఆస్పత్రికి పంపించాలని ఆదేశించారు.
కంటైన్‌మెంట్ జోన్లకు వెళ్లేవారికి, అదేవిధంగా పాజిటివ్ వచ్చిన వారిని పరీక్షించేందుకు వెళ్లే వైద్యులు, ఇతర సిబ్బందికి మాస్కులు,శానిటైజర్లు, ఫేస్ షీల్డ్ మాస్కులు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ విధంగా వైద్యులు మండల స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు.
గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని.. ఇందుకుగాను ఆశ కార్యకర్తలు ప్రతి ఇళ్లు తిరిగి వివరాలను సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పుల శాతాన్ని పెంచాలన్నారు.
ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?