కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు నేటి నుంచి పునః ప్రారంభం కానున్నాయి. వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశాలమేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధనకు జిల్లా విద్యా శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు.
వనపర్తి జిల్లా పరిధిలో ఉన్న 130 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 15 కస్తూర్బా గాంధీ, 17 గురుకుల పాఠశాలలు, 57 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అందులో జిల్లా వ్యాప్తంగా 187 పాఠశాలలో 9, 10 తరగతులకు సంబంధించి విద్యాబోధనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ సుశీంద్ర రావు తెలిపారు.
తొమ్మిదో తరగతిలో 7,937 మంది విద్యార్థులు, పదో తరగతిలో 8,111 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల భౌతిక దూరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయా పాఠశాలల అధ్యాపకులు పేర్కొన్నారు.
9, 10 తరగతుల విద్యాబోధనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యా అధికారి సుఖిందర్ రావు తెలిపారు. భౌతిక దూరం, శానిటైజర్, భోజనవసతికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా కాలంలో ఎంత కష్టంగా ఉన్నా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నామని... ఇప్పుడు విద్యార్థులను పాఠశాలకు పంపితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వనపర్తి జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ
- జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు 11
- సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ 1
- మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే జూనియర్ కాలేజ్ 1
- మోడల్ స్కూల్ అండ్ కాలేజీ కలిగిన కాలేజీలు 3
- ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలు 16
- జిల్లా పరిధిలో మొత్తం 32 కళాశాలలు ఉన్నాయి
- మొదటి సంవత్సరం విద్యార్థులు 1,716 మంది
- ద్వితీయ సంవత్సరంలో 2,060 మంది విద్యార్థులు
ఇదీ చదవండి : నేటి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం