వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు 400 కేవీ విద్యుత్ ఉపకేంద్రం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కొత్తకోట మండలం అమడబాకుల నుంచి పెద్దమందడి మండలం చిన్న మునగాలచేడు గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొని ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు... అందులో వెళ్తున్న రాములు, బాలనాగులు, బాలమ్మ, కృష్ణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. మిషన్ భగీరథ పైపులైన్ల వద్ద ఏర్పాటు చేసిన గేట్ వాల్స్‌కు వీరు సిమెంట్ పనులు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. చిన్న మునగాలచేడు గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాములును మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. బాలనాగులు ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయాలైన బాలమ్మ, క్రిష్ణమ్మ, శ్రీనివాసులును వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు డ్రైవర్ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాము చెప్పారు.
ఇవీ చూడండి: తల్లి మందలించిందని టీనేజ్ యువతి ఆత్మహత్య