ఆసరా పింఛను వయస్సు 57 ఏళ్లకు కుదించి అర్హులందరికీ పింఛన్ అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ అమలుకు నోచుకోకపోవడంతో వేలాది మంది వృద్ధులు ఎదురు చూస్తున్నారు. రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఆసరా వయస్సు 65 నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఏడాది క్రితం ఆసరా అర్హుల జాబితా తయారు చేయాలన్న ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఓటరు జాబితా ఆధారంగా 57 ఏళ్ల వయస్సు ఉన్న వారి జాబితా సిద్ధం చేశారు. ఓటరు జాబితా ఆధారంగా తయారు చేసిన జాబితా ప్రకారం వనపర్తి జిల్లాలో 28,225 మంది ఉన్నట్లు తేల్చారు. పాత వారితో పాటు కొత్తగా ఆసరాకు ఎంపికయ్యే వృద్ధులకు వితంతువులకు ఒక్కొక్కరికీ రూ.2,016, వితంతువులకు రూ.3,016 అందజేస్తామని ప్రకటించారు. ఇపుడు వీరి సంఖ్య 30 వేలకు చేరుకుంటుందని అంచనా.
పెరిగిన అర్హుల సంఖ్య..
ఓటరు జాబితా ఆధారంగా జిల్లాలో 28,225 మంది.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏడాది క్రితమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి అర్హులు గుర్తింపునకు సలహాలు, సూచనలు చేశారు. 2018 నవంబర్ 19న ప్రకటించిన ఓటరు జాబితా ఆధారంగా ఆసరా లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. గతంలో 65 ఏళ్లు నిండిన వారే ఆసరాకు అర్హులుగా ఉన్న విషయం తెలిసిందే. 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం వల్ల ఆసరా అర్హుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో సుమారు 72 వేల మంది వివిధ రకాల పింఛన్లు అందుకున్నారు. జిల్లాలో 28,742 మంది వృద్ధాప్య.. 10,885 వికలాంగులు.. 27,542 వితంతువు.. 715 చేనేత.. 435 గీతా కార్మికులు.. 1,009 బీడీ కార్మికులు.. 2,599 ఒంటరి మహిళలు పింఛన్లు పొందుతున్నారు. వీరికి నెలకు రూ. 8.53 కోట్లు పంపిణీ చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో 19-11-2018 ఓటరు జాబితా ఆధారంగా 57 నుంచి 64 ఏళ్లు మధ్య వయస్సు వారి వివరాల జాబితా తయారు చేసి ప్రకటించారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని డీఆర్‌డీవో కోదండరాం వివరించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదు