వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామానికి చెందిన కిష్టమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. కుమారుడు మహబూబ్‌నగర్‌లో.. కిష్టమ్మ మామిడిమాడలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
పదిహేను రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు చికిత్స కోసం మహబూబ్‌నగర్‌లోని జనరల్ ఆసుపత్రికి వచ్చారు. నీరసంతో నడవలేని స్థితిలో పాత పాలమూరు ప్రధాన రహదారి పక్కన ఇలా పడుకొని ఉండిపోయారు. కరోనా సోకిందేమోనన్న భయంతో ఆమె వద్దకు ఎవరూ రాలేకపోయారు. కుమారుడు ఉన్నా.. పట్టించుకోవడం లేదని, వైద్యం చేయించేవారు లేక ఎలా బతికేదంటూ ఆ వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె బాధ చూసి కంటతడి పెట్టిన వారే తప్ప.. దగ్గరికొచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే వారే కరవయ్యారు.
ఇలా కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్ప దీని కట్టడికి వేరే మార్గం లేదని నిపుణులు చెబుతున్నారు.
- ఇదీ చదవండి : పల్లెలపై కరోనా పంజా.. వైద్య భరోసా ఎలా?