వనపర్తి జిల్లాలోని వనపర్తి- కొత్తకోట మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఉన్నత విద్యాసంస్థలు, గోదాములు ఆగ్రో పారిశ్రామిక వాడల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువార జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, అదనపు కలెక్టర్ వేణు గోపాల్లతో కలిసి వనపర్తి- కొత్తకోట మధ్య ఉన్న ప్రభుత్వ స్థలాలను మంత్రి పరిశీలించారు. సంకిరెడ్డిపల్లి వద్ద 225 సర్వే నెంబర్లో ఉన్న 33 ఎకరాల 12 గుంటల భూమిని, 174 సర్వే నెంబర్లో ఉన్న మరో 165 ఎకరాల ప్రభుత్వ భూమిని మంత్రి, కలెక్టర్ పరిశీలించారు. భవిష్యత్తులో వనపర్తి -కొత్తకోట రెండు పట్టణాలు అభివృద్ధి జరిగేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు.
స్థలాల్ని గుర్తించి మార్కింగ్ ఇవ్వాలి...
ఇందుకు ఆయా సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలాల్ని గుర్తించి మార్కింగ్ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రీయల్ పార్కు, ఆటోనగర్ల ఏర్పాటు, ఆగ్రో ఫ్యూయల్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. మంత్రి సూచనతో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో మాట్లాడి గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో పైన పేర్కొన్న గోదాములు, విద్యాసంస్థలు, ఆగ్రో పారిశ్రామిక వాడల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. కార్యక్రమంలో పీఏసీఏస్ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, కొత్తకోట తహసిల్దార్ రమేష్ రెడ్డి ఉన్నారు.
ఇవీ చూడండి : భారత్లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 67మంది మృతి