Medical Student Died in Philippines : సంగారెడ్డి జిల్లాకు చెందిన స్నిగ్ధ అనే వైద్య విద్యార్థిని ఫిలిప్పీన్స్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్ దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో స్నేహితులు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారు. ఇంతలోనే ఆమె గదిలో శవమై కనిపించారు. అది చూసిన స్నేహితులంతా ఒక్కసారిగా ఏం జరిగింది అనే భయాందోళనలోకి వెళ్లిపోయారు. స్నిగ్ధ తల్లిదండ్రులకు ఈ ఘటన గురించి తెలియజేశారు.
సమాచారం అందుకున్న పటాన్‌చెరులోని ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తండ్రి అమృత్‌రావు తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో డీఈగా (డివిజినల్ ఇంజినీర్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశం రప్పించేందుకు ఫిలిప్పీన్స్ దేశ అధికారులతో సంప్రదింపులు జరపాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
విదేశాలలో తెలుగు విద్యార్థుల మృతి కేసులు : లండన్‌లో చదువు కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు మృతి చెందిన సందర్భాలు ఇటీవల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. కొందరి మరణాలకు కారణం తెలియకుండానే కాలం మారిపోతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విదేశాలు కాబట్టి కాస్త కష్టంగానే మారింది. వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి రమేష్-రజితల కుమారుడు దేవులపల్లి ప్రణయ్ ఏడాదిన్నర క్రితం లండన్ వెళ్లాడు. లండన్‌లో ప్రణయ్ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. స్నేహితుల ద్వారా ప్రణయ్ మరణించిన వార్త తల్లిదండ్రులకు సమాచారం అందింది. తమ కుమారుడు మరణించాడనే వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని వరంగల్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు.
అమెరికాలో హనుమకొండ వాసి మృతి : గతంలో హనుమకొండకు చెందిన ఉత్తేజ్ అనే విద్యార్థి అమెరికాలో మృతి చెందాడు. సెయింట్ లూయిస్ కళాశాలలో ఎమ్మెస్ చదువు కోసం అమెరికా వెళ్లాడు. చెరువులో స్నేహితుడు మునిగిపోతుండగా కాపాడే ప్రయత్నంలో నీటిలో గల్లంతయ్యాడు. రెస్క్యూ సిబ్బంది వెతకగా తన స్నేహితుడు శివ, ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉత్తేజ్ మరణ వార్త వినగానే ఆయన తల్లిదండ్రులు బోరున విలపించారు.
చైతన్యపురిలో ఓ వ్యక్తి అనుమాస్పద మృతి
యువతి అనుమానాస్పద మృతి... కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా