Murder In Jangaon : తనకు పురుషత్వం లేదని అవమానించాడని ఆగ్రహించిన ఓ ఉన్మాది క్షణికావేశంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ప్రణాళిక ప్రకారం ఇంటికే పిలిపించుకొని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం : జనగామ జిల్లా ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గంపల పరశురాములు (40) తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. వచ్చిన డబ్బులతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన పర్వత మహేందర్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం పనికి వెళ్తున్నాడు. ఆ సమయంలో పరశురాముల భార్య ఆరోగ్యం బాలేకపోవడంతో చికిత్స నిమిత్తం మహేందర్ దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చే విషయంలో ఇద్దరు కొంత కాలంగా గొడవలు పెట్టుకుంటున్నారు. దీంతో బుధవారం రాత్రి 12.45 గంటలకు మహేందర్ పరశురాములుకు పదే పదే ఫోన్ చేస్తూ ఇంటికి రమ్మనడంతో వెళ్లాడు. అంత రాత్రి ఎందుకు రమ్మన్నాడనే అనుమానంతో భార్య సంధ్య, కుమారుడు అనిరుద్ కనిపెట్టుకుంటూ ఆయన వెనకాలే వెళ్లారు.
అప్పటికే చేతిలో కత్తి పట్టుకుని ఉన్న మహేందర్ ‘నాకు పురుషత్వం లేదని అంటావా’ అని దుర్భాషలాడుతూ ఆవేశంలో కత్తితో పరశురాములు తలపై నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, కుమారుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జనగామ పోలీసులు చేరుకొని మహేందర్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్నిశవ పరీక్షకు తరలించారు. భార్య సంధ్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రూరమైన మనస్తత్వం : పరశురాములు హత్య విషయం తెలిసి గ్రామస్థులు రఘునాథపల్లి సర్కిల్ కార్యాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట ఏసీపీలు భీం శర్మ, అంబటి నర్సయ్య, స్థానిక సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేశ్‌తో పాటు పరిసర పోలీసుస్టేషన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది చేరుకుని బందోబస్తు నిర్వహించారు. హత్యకు పాల్పడిన మహేందర్ క్రూరమైన మనస్తత్వం కలవాడని, అందుకే తన ఇద్దరు భార్యలు విడాకులు తీసుకొన్నారని గ్రామస్థులు పోలీసు అధికారులకు తెలియజేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ భీం శర్మ వారిని శాంతింపజేశారు.
దళిత సంఘాల ఆందోళన : పరశురాములు హత్యను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రఘునాథపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతోపాటు దళితులకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ మల్లేశ్, జిల్లా ఇన్‌ఛార్జి జేరిపోతుల సుధాకర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఉపేందర్ పాల్గొన్నారు.
వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని మహిళ బ్లాక్ మెయిల్ - వేధింపులు భరించలేక హత్య
ప్రేమించిన అమ్మాయిని తనకు దక్కకుండా చేస్తున్నారని కక్ష - యువతి తండ్రిపై ప్రేమోన్మాది కాల్పులు