పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాల్లోని నర్సరీల్లో వేలాది మొక్కలను పెంచుతున్నారు. మొక్కల పెరుగుదలను పరిశీలించేందుకు నర్సరీల్లో కూలీలు, సంరక్షకులను ఏర్పాటు చేశారు. నర్సరీలకు స్థలం, నీటి వసతి కల్పిస్తున్న వారికి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నగదు చెల్లిస్తోంది. గత మూడు నెలలుగా ప్రభుత్వం బకాయి బిల్లులను చెల్లించడం లేదు. దీంతో కూలీలు, మొక్కల సంరక్షకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వనపర్తి జిల్లాలో గత జనవరి నుంచి నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యక్రమం ప్రారంభమైంది. ఉపాధిహామీ నిధులతో మొక్కలను పెంచే బాధ్యతలను ఉన్నతాధికారులు ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అప్పగించారు. ఈ మేరకు అధికారులు ఉపాధి హామీ పథకం కింద కూలీలు, మొక్కల సంరక్షకులను నియమించారు. ఈ బిల్లులు గత మూడు నెలలుగా రావడంలేదు. మొక్కల సంరక్షకులతోపాటు స్థలం, నీటి వసతి కల్పిస్తున్న నర్సరీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
వనపర్తి మండలం పెద్దగూడెం సమీపంలోగల నర్సరీలో గత ఫిబ్రవరి నుంచి పెంచుతున్న 40 వేల మొక్కలకు సంబంధించిన బిల్లులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతే కూలీలకు డబ్బు చెల్లించేదెలా అని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
ఇదే మండలంలోని దత్తాయిపల్లి గ్రామ సమీపంలోని నర్సరీలో పెంచుతున్న మొక్కలకు సంబంధించి సుమారు రూ.76 వేలను చెల్లించాలి. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని నర్సరీ యాజమానులు కోరుతున్నారు.
మంజూరుకాగానే చెల్లిస్తాం..
జిల్లాలో మూడు నెలలకు సంబంధించిన హరితహారం బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున బిల్లులు మంజూకాలేదు. ప్రభుత్వం నుంచి బిల్లులు అందగానే మొక్కల సంరక్షకులు, నర్సరీల నిర్వాహకులకు అందజేస్తాం.
- గణేశ్, డీఆర్‌డీవో, వనపర్తి