వనపర్తి జిల్లాలో లాక్‌డౌన్ అమలు తీరుపై కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు లేనప్పటికీ... కర్నూలు, గద్వాల జిల్లాలు దగ్గరగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం, తదితర ప్రదేశాల్లో ఉదయపు నడక పేరుతో బయటికి వచ్చే వారిని కట్టడి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే ఇటుకబట్టీలు, చేనేత, స్టోన్ క్రషింగ్, చిన్న చిన్న మరమ్మతులను చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. వీటికి కొనసాగింపుగా బీడీ తయారీ, ఇసుక మైనింగ్, స్టీల్, సిమెంటు కర్మాగారం, ప్లాస్టిక్ పైపుల నిర్మాణం, కాగితపు తయారీ ఇతర పనులకు మాత్రమే అనుమతిస్తామన్నారు. పట్టణాలలో ఎలాంటి మినహాయింపులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఉపాధి హామీ పనులపై దృష్టి సారించాలి...
పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పనులను తనిఖీ చేయాలని కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా ఆదేశించారు. ఉపాధి పనుల పర్యవేక్షణకు మండలాల వారీగా జిల్లా స్థాయి సీనియరు అధికారులను కేటాయించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, ఆర్డీవో చంద్రారెడ్డి, డీఆర్‌డీఏ గణేశ్ జాదవ్, తహసీల్దారు రాజేందర్‌గౌడ్ పాలిటెక్నిక్ మైదానాన్ని సందర్శించారు. ఉదయపు నడకకు ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.