జూరాల ప్రధాన కాలువ చివరి ఆయకట్టుకు నీళ్లు రావడం లేదని వనపర్తి జిల్లా చిన్నంబావి మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణకు వచ్చిన జూరాల డీఈ శ్రీనివాస్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిని దగడపల్లి సమీపంలో నిర్బంధించారు. నీరులేక పంటలు ఎండిపోయే స్థితికి చేరుకున్నా... ఎందుకు స్పందించలేదని అధికారులను నిలదీశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వస్రం నాయక్ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని గోపాల్ దిన్నె, సింగవరం, కొండూరు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. లక్షలు ఖర్చు చేసి పండిస్తున్న పంటలు ఎండిపోతుంటే.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే జూరాల కాలువ చివరి ఆయకట్టు వరకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటి విడుదల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పడంతో రైతులు శాంతించారు.
జూరాల నుంచి ఆయకట్టుకు చుక్కనీరు రావడం లేదు. పంట పొలాలు ఎండిపోతున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదు. మా ఎమ్మెల్యేకి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఏఈ, డీఈలకు కూడా ఇదివరకే చెప్పాము. అయినా పట్టించుకోవడం లేదు. చివరి ఆయకట్టుకు నీళ్లు రావని ముందే చెప్పినా మేము పంటలు వేయకపోదుము కదా. బాధిత రైతు
ఇదీ చదవండి: పది రోజులు మృత్యువుతో పోరాటం.. ప్రాణాలొదిలిన బాలింత