వనపర్తి జిల్లా అమరచింత పట్టణంలో డెంగీ వ్యాధితో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకే రోజు 13 మంది డెంగీ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. అధికారులు రెండు రోజుల్లో పంపిన 13 కేసుల్లో ఒకే రోజు 6 కేసులు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కారణాలు కనుగొనడానికి ఇప్పటికే రెండు రోజులుగా జిల్లా వైద్యాధికారులు బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు.
విద్యార్థులు భారీ స్థాయిలో జ్వరం బారిన పడుతుండటం వల్ల కలెక్టర్, ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆరు బయట నీటి నిల్వను చూసి కలెక్టర్ మండిపడ్డారు. నీటి నిల్వ పెట్టడం వల్ల దోమలు వృద్ధి చెందుతాయని... ఫలితంగా డెంగీ సోకుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కుటుంబీకులకు అవగాహన కల్పించారు. ప్రతి రోజు నీటిని తాజాగా పెట్టుకోవాలని సూచించారు.