వచ్చే సంవత్సరం జనవరిలో కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. మొదటి విడతలో.. డాక్టర్లు, నర్సులు, అంగన్వాడి , ఆశ కార్యకర్తలకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ పలు విషయాలు వెల్లడించారు.
వర్గాలుగా విభజించి..
పోలీస్, ఆర్మీ ,మున్సిపల్, పంచాయతీరాజ్ ఉద్యోగుల తర్వాత ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందులోనూ యాభై ఏళ్లు పైబడినవారు, అంతకు తక్కువ వయసు ఉన్న వారిని వర్గాలుగా విభజించి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అందుకు అన్ని సౌకర్యాలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులను గుర్తించాలని తెలిపారు.
అబ్జర్వేషన్ రూంల ఏర్పాటు..
ప్రతిచోటా వెయిటింగ్, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పరిశీలించేందుకు అబ్జర్వేషన్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. గదుల్లో 24 గంటల విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌకర్యాలపై నిర్ధారణ చేసుకోవాలని తెలిపారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్సు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
నిబంధనలు పాటించాలి..
వ్యాక్సిన్ వేసిన ప్రతి ఒక్కరికీ గుర్తు వేయాలని తెలిపారు. దివ్యాంగులు , నడవలేని వారి కోసం వీల్‌చైర్, ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలందరూ తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా ఉన్నవారు క్వారంటైన్ పూర్తయిన తర్వాతే వ్యాక్సిన్ వేసుకోవాలని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్ కోసం యాప్‌ను రూపొందించనుంది. అందులో ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదేశాలు వెలువడిన వెంటనే అందుబాటులోకి తీసుకొస్తాం. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పూర్తయిన తర్వాత డీపీఓ, డీఆర్డీఓ, ఇతర శాఖల సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. విధుల్లో అధికారులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి.