వనపర్తి జిల్లా పెబ్పేరు మండలం కంచీరావుపల్లి తండా గ్రామం. ఇటీవలే ఈ తండా పంచాయతీగా మారింది. జనాభా సుమారు 500 మంది ఉంటారు. తరతరాలుగా ఈ తండాలో కోడికూర, కోడి గుడ్డు, చేపలు అసలు తినరు. కారణం వారి గురువు సోమ్సాధ్ భావోజీ... కోళ్లను, చేపల్ని తినొద్దని చెప్పారట. అప్పటి నుంచి రాత్లావత్ అనే ఇంటి పేరు కలిగిన వారు ఎవరూ కోడి, చేప మాంసాన్ని ముట్టుకోరు. గుడ్డు తినరు. కోడి, చేపలను పెంచరు. అందుకే తండాలో ఎక్కడ వెతికినా కోడి మాత్రం కనిపించదు.
ఇదే కారణం:
తాను ఉమ్మేసిన ఉమ్మిని కోడి తినడం చూసిన బావోజీ... అలాంటి కోళ్లను అసలు పెంచొద్దు. తినొద్దు అని ఆదేశించారు. అప్పటి నుంచి ఆ ఊళ్లో కోళ్లు బంద్. ఒకవేళ ఎవరైనా కట్టుబాటు దాటి తింటే వారికి చెడు జరుగుతుందని తండా వాసుల ప్రగాఢ విశ్వాసం.
కోడళ్లు కూడా తినొద్దు:
పండగలు వస్తే తండావాసులు గొర్రె, మేక మాంసాన్ని వండుకుని తింటారు. ఇంటికి బంధువులు వచ్చినా... వీరు బంధువుల ఇళ్లకు వెళ్లినా వండాల్సింది మటనే. కంచీరావుపల్లితండా నుంచి మెట్టినింటికి వెళ్లే ఆడపడుచులు అక్కడ ఏ మాంసమైనా తింటారు. కానీ తండాకు కోడళ్లుగా వచ్చే ఆడపిల్లలు మాత్రం పెళ్లి సంబంధం ఖాయమైన నెల రోజుల్లోనే చికెన్, గుడ్డు, చేపలను తినడం మానేస్తారు. బలవంతంగా తినాలని ప్రయత్నిస్తే వాంతులవుతాయని... అసలు తినాలనే అనిపించదని చెబుతున్నారు ఆ తండాకు కోడళ్లుగా వచ్చిన వాళ్లు.
ఎక్కడికెళ్లినా పాటిస్తారు:
ఇక తండా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి నివాసముండే వాళ్లు సైతం అక్కడ తమ ఆచారాన్ని తప్పకుండా పాటిస్తారు. తాతలు, తండ్రులు సహా ఇప్పటి తరం కూడా ఈ ఆచారాన్ని బలంగా విశ్వసిస్తోంది.
ఇదీ చూడండి : గోదావరిలో వ్యర్థాల విడుదలపై సుమోటో కేసు నమోదు...