Aawaz Wanaparthi: కమర్ రెహమాన్. పొదుపు సంఘాల సభ్యులు, స్వయం ఉపాధి కోసం శిక్షణ పొందిన మహిళలు ఎక్కడో చోట ఈ పేరు తప్పకుండా వినే ఉంటారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో పొదుపు సంఘాలను నిర్మించడంలో, మహిళలకు స్వయం ఉపాధి దిశగా నడిపించడంలో రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రవ్యాప్తంగా సేవలందించారామె. 1994లో వనితా జ్యోతి మహిళా సంఘం అనే స్వచ్చంద సంస్థ స్థాపించి, డీఆర్డీఏ సాయంతో 20వేల మందికి పైగా కంప్యూటర్, టైలరింగ్, మగ్గం, సర్చ్ తయారీ, అగరొత్తులు, వడ్రంగి పనుల్లో శిక్షణ ఇచ్చారు. వనితా జ్యోతి మహిళా సంఘం నుంచి శిక్షణ పొందిన ఎంతోమంది మహిళలు ప్రస్తుతం ఆమె సాయంతో స్వయం ఉపాధిని పొందుతున్నారు. అంతే కాకుండా నిరక్షరాస్యత, సారానిషేదం, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సహా నేటితరం కొవిడ్ నియంత్రణ, డిజిటల్ అక్షరాస్యత వరకూ మహిళల కోసం అనేక సామాజిక, అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.
వనితా జ్యోతి ద్వారా: కమర్ రెహమాన్ తల్లికి, పెళ్లైన పద్నాలుగేళ్ల తర్వాత ఆమె పుట్టారు. ఆ తర్వాత తల్లి ఆరోగ్యం పాడైంది. చనిపోకముందే పెళ్లిచూడాలని తల్లి పట్టుబట్టడంతో పన్నెండేళ్ల వయసులోనే కమర్ రెహమాన్‌కు వివాహం చేశారు. దీంతో ఆరోతరగతిలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. కాని భర్త ప్రోత్సాహంతో చదువుపై దృష్టి పెట్టి పదోతరగతి, డిగ్రీ పూర్తి చేశారు. అప్పట్లో మహిళల్లో చదువు, పొదుపుని ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమాలు ఆమెను ఆకట్టుకున్నాయి. కమర్ రెహమాన్ పాటలు బాగా పాడేవారు. ఆశువుగా పాటలు అల్లేవారు. దాంతో అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార బాధ్యతల్ని అప్పగించారు. అలా గజ్జెకట్టి, పాటలు-పాడుతూ పల్లెపల్లెనా పొదుపు గురించి వివరించే వాళ్లు. ఆ కార్యక్రమాల కోసం దేశమంతా తిరిగారు. యూఎన్డీపీ ఆధ్వర్యంలో కళాకారులకి వందల వర్క్ షాపులు నిర్వహించారు. అలా కల్చరల్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఆ తర్వాత వనితా జ్యోతిని స్థాపించి స్వచ్ఛందంగా తన సేవల్ని కొనసాగిస్తున్నారు.
ఆవాజ్ వనపర్తి: వనితా జ్యోతి సేవల్ని ప్రజలకు చేరువ చేసేందుకు 'ఆవాజ్ వనపర్తి 90.4' అనే కమ్యూనిటి రేడియోను స్థాపించారమే. 2014 నుంచి ప్రయత్నిస్తే 13 రకాల వడపోతల అనంతరం 2019లో కేంద్రం ఈ రేడియో స్టేషన్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అందుకు అవసరమైన స్థలం, నిధులు ప్రభుత్వమే సమకూర్చగా కొంత సంఘ సభ్యులు సమకూర్చుకున్నారు. అందులో పనిచేసే సిబ్బంది, కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్లల్లో అత్యధికులు మహిళలే. ఫక్తు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను మాత్రమే ప్రసారం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రేడియో. ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ల కోసమే ఈ రేడియోని ఏర్పాటు చేశానంటారు వనితా జ్యోతి మహిళ సంఘ వ్యవస్థాపకురాలు కమర్ రహమాన్.
ఏకైక రేడియో: 'ఆవాజ్ వనపర్తి 90.4'. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్రం మంజూరు చేసిన ఏకైక రేడియో స్టేషన్ అది. మహిళలు, రైతులు, కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన కమ్యూనిటీ రేడియో. ఇందులో వివిధ రంగాల్లో ఉత్యుత్తమ సేవలందించిన వాళ్లు మంచి-మాట చెబుతారు. చుట్టుపక్కల ఉండే కళాకారులే మనపాట- మంచిపాట పాడతారు. మహిళ సంఘాల సభ్యులే వంట- వార్పు నేర్పుతారు. రైతులు కోళ్ల పెంపకం, వ్యవసాయం, పంటల గురించి వివరిస్తారు. మహనీయుల జీవిత గాధలతో వక్తలు స్పూర్తిని నింపుతారు. సమకాలీన అంశాలపై నిపుణులు ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. సుమారు వెయ్యి మంది కళాకారులు ఈ రేడియో ద్వారా జనానికి పరిచయమయ్యారు. చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో ఆవాజ్ వనపర్తి రేడియో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అదే పేరుతో వెబ్ రేడియో, యూట్యూబ్, ఫేస్‌బుక్, టిట్టర్, లింక్డిన్ ఖాతాల్లో ప్రసారాలు అందుబాటులో ఉంచుతున్నారు. రోజుకు 4గంటల కార్యక్రమాలను స్టూడియోలో రికార్డు చేసి రోజంతా ప్రసారం చేస్తున్నారు. ఈ సమయాన్ని, కార్యక్రమాలను మరింత విస్తరించి ప్రజలకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు కమర్ రెహమాన్.
ఇదీ చదవండి :