వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలోని రంగసముద్రం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురైన నగరాల భూనిర్వాసితులకు వంద రోజుల్లో పరిహారాన్ని అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఏడు నెలలుగా రాష్ట్ర ఖజానాకు రావల్సిన రూ.50 కోట్లు కరోనా ప్రభావంతో రాలేక పోయాయని మంత్రి తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరాల గ్రామం ముంపునకు గురైన విషయాన్ని తెలుసుకున్న మంత్రి... గ్రామంలో పర్యటించారు.
గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈపాటికే ముంపు నిర్వాసితులకు ప్రకటించిన పరిహారం అందాల్సిందని... ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి, తనకు నివేదిక సమర్పించారని మంత్రి పేర్కొన్నారు. కరోనా కారణంగా జాప్యం జరిగిందని వీలైనంత త్వరగా అందరికీ పరిహారం అందేలా చూస్తానని గ్రామస్థులకు మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.