వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో కొత్త జాతి మొక్కను వృక్ష శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అపోసైనేసి కుటుంబానికి చెందిన ఈ జాతికి బ్రాకిస్టెల్మా అనంతగిరియెన్సే అని పేరు పెట్టారు. డెన్మార్క్ నుంచి వెలువడే అంతర్జాతీయ పత్రిక నార్డిక్ జర్నల్ అఫ్ బోటనీలో నూతన ఆవిష్కరణ ప్రచురితమైంది. భారతదేశంలో బ్రాకిస్టెల్మా ప్రజాతికి చెందినవి 38 రకాల మొక్కలుండగా 39వ జాతిగా బ్రాకిస్టెల్మా అనంతగిరియెన్సేని ఆవిష్కరించారు. క్షేత్ర సందర్శనల్లో భాగంగా అనంతగిరి కొండల గడ్డిమైదానాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయ వృక్షశాస్త్రజ్ఞులు డాక్టర్ ఎ. విజయ భాస్కర్ రెడ్డి, పరిశోధక విద్యార్ధి పరమేష్ లింగాల, జడ్చర్ల డాక్టర్ బి.ఆర్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ సదాశివయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి పరిశోధకుడు డాక్టర్ కె. ప్రసాద్ ఈ జాతిని గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో మాత్రమే ఈ జాతి మొక్కలు కనిపిస్తాయని జడ్చర్ల వృక్ష శాస్త్ర సహాయ ఆచార్యులు సదాశివయ్య వెల్లడించారు. అందుకే అనంతగిరి పేరు కలిసేలా నూతన మొక్కజాతికి నామకరణం చేసినట్లు తెలిపారు. ఆకురాల్చే అడవులు, గడ్డి మైదానాల్లో గడ్డితో పాటే ఇవి పెరుగుతాయి. నిమ్మగడ్డి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఎక్కువగా గమనించారు. లేతగులాబీ రంగు ఆకులతో మొదటి వర్షాల తరువాత మాత్రమే ఇవి కనిపిస్తాయి. అనంతగిరి అభయారణ్యంలో కేవలం 3 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే వీటిని గుర్తించారు. పక్కనే ఉన్న ప్రాంతాల్లో శోధించినా అలాంటి మొక్కలు కనిపించలేదు. మేత, పర్యాటకం, కాలానుగుణ, మానవజన్య కారణాలు, అటవీ మంటలతో ఈ జాతికి ముప్పు పొంటి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: OIL PALM: '20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు'