Revanth Reddy Road show in Kodangal : పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం.. కొడంగల్‌లో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇవాళ దౌల్తాబాద్, మద్దూర్, గుండుమల్లో రోడ్‌షో నిర్వహించారు. గత ఐదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమేనని.. కొడంగల్‌లో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్‌దేనని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ చేస్తామని.. కేసీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల కష్టాలు తెలుసని.. రైతుబంధు తామెందుకు బంద్ చేస్తామని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి వర్సెస్ అసదుద్దీన్ ఒవైసీ-ఆ సవాల్‌కు సిద్ధమై అంటూ రేవంత్ వ్యాఖ్యలు
Telangana Assembly Elections 2023 : నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా.. మన ప్రాంతాన్ని పాడు చేశారని ధ్వజమెత్తారు. దౌల్తాబాద్‌లో తాను వేసిన రోడ్లే కనిపిస్తున్నాయన్నారు. నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఇసుక దందా, ట్రాక్టర్లపై కమిషన్లు తీసుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకోస్తే.. నిర్మించకుండా వదిలేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు, రైల్వే లైన్, డిగ్రీ కాలేజ్ ఏవి తీసుకురాలేదని దుయ్యబట్టారు. మద్దూరులో తాగునీటి సమస్య వల్ల ఈ ఊరికి పిల్లనిచ్చే వాళ్లు కాదని.. తన హయాంలోనే కోయిల్ సాగర్ నుంచి నీటి వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 100 పడకల హాస్పిటల్, స్టేడియం నిర్మిస్తామన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తి చేసి.. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చే బాధ్యత కాంగ్రెస్‌దని హామీ ఇచ్చారు.
Revanth Election Campaign in Kodangal : రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని.. రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. చేయూత పేరుతో వృద్దులకు, వికలాంగులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు.. అర్హలైన వారికి నెలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
రైతు భరోసా(Rythu Bharosa) కింద.. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా ఎకరాకు రూ.15,000 పెట్టుబడి సాయం, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే కూలీలకు ప్రతి ఏటా రూ.12,000, వరి పంట పండించే రైతులకు.. మద్దతు ధరకు అదనంగా మరో రూ.500 బోనస్ కింద కలిపి చెల్లిస్తామన్నారు. సీఎం కేసీఆర్.. డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. తాను మాత్రం పంజాగుట్టలో రూ. 2000కోట్లతో ఇంద్రభవనం నిర్మించుకున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఇల్లులేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతి నెలా రూ.2500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఇవ్వనున్నట్లు తెలపారు. ఆడపిల్లల పెళ్లికి రూ. లక్షతో పాటు.. తులం బంగారం ఇస్తామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు గృహలక్ష్మి కింద నెలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
"కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ చేస్తామని.. కేసీఆర్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. రైతుబంధును మేమేందుకు బంద్ చేస్తాం. రాష్ట్రంలో రైతుభరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000 పెట్టుబడి సాయం అందిస్తాం". - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ అగ్రనేతలతో సుడిగాలి ప్రచారాలకు ప్లాన్, ఈ నెల 17న తెలంగాణకు రాహుల్ గాంధీ