Kalari Training in Kodangal : కలరి యుద్ధ విద్యను అద్భుతంగా నేర్చుకుని, శిక్షణ ఇస్తున్న యువకుడి పేరు రమేశ్. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చిట్లపల్లి పరిధిలోని ఖాజా అహ్మద్‌పల్లి తన స్వస్థలం. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్‌పై ఇష్టంతో కరాటే నేర్చుకున్నాడు. కలరిపయట్టుపై ఆసక్తితో కేరళ వెళ్లి పట్టు సాధించాడు. దానికి తెలంగాణలో మరింత ప్రాముఖ్యత కల్పించడమే లక్ష్యమంటూ తను ఎలా నేర్చుకున్నాడో వివరించాడు. అత్యంత ప్రాచీనమైన యుద్ధ క్రీడే అయినా.. ప్రస్తుత సమాజం కలరిపయట్టు నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని రమేశ్ అంటున్నాడు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ విద్య నేర్చుకోవాలని సూచిస్తున్నాడు. తను నామమాత్రమైన రుసుముతోనే 200 మందికి కలరి నేర్పిస్తున్నాడు. కలరిలో ఉండే దశలను వివరిస్తున్నాడు.
ఆయుధం లేకున్నా రక్షించుకోవచ్చు..: ఆంగ్లేయులు మనల్ని పాలిస్తున్న సమయంలో ఈ యుద్ధ క్రీడపై నిషేధాన్ని విధించారు. కానీ మలయాళీలు రహస్యంగా వారసులకు దీన్ని నేర్పారు. అందువల్లే ఇదింకా మనుగడలో ఉంది. ప్రస్తుతం యువత, చిన్న పిల్లలు, ఆడపిల్లలు నేర్చుకుంటున్న కరాటే, కుంగ్ ఫూ లాంటి యుద్ధక్రీడలకు మూలం కలరినే. ఈ యుద్ధ విద్య నేర్చుకోవడం వల్ల అనేక ఉపయోగాలున్నాయని అంటున్నాడు రమేశ్. ఎవరు ఎప్పుడు ఎలా దాడి చేసినా ఆయుధం లేకున్నా తమను తాము రక్షించుకోవచ్చని చెబుతున్నాడు.
కలరి అంటేనే కేరళ. ఆ విద్య నేర్చుకోవాలన్నా, నైపుణ్యాలు పొందాలన్నా కేరళకే వెళ్లాలి. అక్కడే ఉండాలి. కావాల్సిన సమయాన్ని కేటాయించాలి. కనీసం నెలకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాలి. అతంటి వ్యయ ప్రయాసలకోర్చి నేర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకే తెలంగాణలో కొడంగల్ నియోజకవర్గంలో నామమాత్రపు రుసుముతో ఈ విద్యను రమేశ్ నేర్పుతున్నాడు.
ప్రభుత్వం సాయం అందిస్తే.. కళను విస్తృతం చేస్తా..: ఆంగ్లంలో పీజీ పూర్తి చేసిన రమేశ్‌కు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఉన్నా.. కలరి కోచ్‌గా స్థిరపడేందుకే నిర్ణయించుకున్నారు. తెలంగాణలోనూ ఈ విద్యను నేర్చుకున్న వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నా.. ఇతరులకు నేర్పేందుకు సిద్ధమైన వాళ్లు లేరు. అందుకే భారతీయ ప్రాచీన యుద్ధ కళను తెలంగాణలోనూ విస్తృతం చేసేందుకు రమేశ్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దేశంలో కలరికి కేరాఫ్ అడ్రస్ కేరళలాగే.. కొండగల్‌ను మార్చాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు. అందుకోసం శిక్షణ కేంద్రం, ఆయుధాల లాంటి వాటికి రూ.50 లక్షల ఖర్చవుతుందని.. ప్రభుత్వం గుర్తించి సాయం అందజేయాలని కోరుతున్నాడు.
"మాకు రమేశ్ సర్ కలరి నేర్పిస్తున్నారు. కేరళ వెళ్లకుండానే సర్ వల్ల ఇక్కడ నేర్చుకోగల్గుతున్నాం. అమ్మాయిలకు వారిని వారు రక్షించుకునేందుకు ఉపయోగపడుతుంది. నేను నేర్చుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది."-కలరి నేర్చుకుంటున్న శిక్షకురాలు
ఇవీ చదవండి: