Revanthreddy on Hath Se Hath Jodo Yatra: 'భారత్ జోడో' యాత్రకు కొనసాగింపుగా 'హాథ్ సే హాథ్ జోడో' యాత్ర ప్రారంభించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన నిలబడి భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తెలిపిన సందేశాన్ని ప్రతి గడపకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం మదనపల్లి నుంచి 'హాథ్ సే హాథ్ జోడో' యాత్రను రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం 'హాథ్ సే హాథ్ జోడో' యాత్ర కరపత్రాలు విడుదల చేశారు.
అధికారంలోకి రావడమే లక్ష్యంగా యాత్ర : ఫిబ్రవరి 6 నుంచి 2 నెలలపాటు ఈ యాత్ర కొనసాగుతుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. దిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు టీపీసీసీ అధ్యక్షుడిని అయినా కొడంగల్ నుంచే 'హాథ్ సే హాథ్ జోడో' యాత్రను ప్రారంభించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
చనిపోతే తప్ప బ్రతికుంటే పథకాలు వచ్చేలా లేవు : గత 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ తన నిరంకుశ పాలను కొనసాగిస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరిగిందన్నారు. కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచిన ఏ ఒక్క గ్రామంలో దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు రెండు పడక గదులు రాలేదని ఆయన ఆరోపించారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించమని అడిగితే.. రైతులు చనిపోయిన తర్వాత రైతు బీమా ద్వారా ఐదు లక్షలు ఇస్తున్నామంటున్నారని ఆరోపించారు. అంటే రాష్ట్రంలో రైతులు చనిపోతే తప్ప బతికుంటే ఎటువంటి పథకాల లబ్ధి చేకూరేలా లేదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే అందరూ కలసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి యువకుడిపై ఉందన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. 'హాథ్ సే హాథ్ జోడో' యాత్ర ప్రారంభ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహపరిచారు.
ఇవీ చదవండి: