వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తాత్కాలిక దారులు కొట్టుకుపోతున్నాయి. కొన్నాళ్ల క్రితం ధారూర్ మండలం దోర్నాల వద్ద ఘటన మరచిపోకముందే మన్‌సాన్‌పల్లిలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల శుక్రవారం తెల్లవారుజామున పెద్దేముల్ మండలం మన్‌సాన్‌పల్లి వద్ద తాండూరు, హైదరాబాద్ ప్రధాన రహదారికి భారీ గండి పడింది.
దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. తాండూరు చేరుకోవాల్సిన వారు ధారూర్, పెద్దేముల్ మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. తాండూరు నుంచి పెద్దేముల్, ధారూర్ మీదుగా వికారాబాద్, హైదరాబాద్‌కు నడిపారు. ఈ విషయం తెలియక ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
రూ.50 కోట్లు ఉన్నా...
తాండూరు, హైదరాబాద్ మార్గంలో వంతెనలు నిర్మించేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. నిధులు రాగానే అధికారులు టెండర్లు చేపట్టి పనులను గుత్తేదారులకు అప్పగించారు. ముందుగా మన్‌సాన్‌పల్లి సమీపంలోని చిన్న వాగుపై పనులు ప్రారంభించగా ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. తర్వాత మన్‌సాన్‌పల్లి పెద్ద వాగుపై రెండు నెలల క్రితం పనులు ప్రారంభించారు. పాత వంతెనను పూర్తిగా తొలగించి దాని పక్కనే తాత్కాలిక దారి నిర్మించారు. నీరు పోవడానికి కల్వర్టుకు ఏర్పాటు చేసినట్లు నాలుగు పైపులను మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో నీటి ఉద్ధృతికి అవి నిలవలేదు. రోడ్డు కొట్టుకుపోయింది. కందనెల్లి వాగుపై వంతెన నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
కోట్‌పల్లి అలుగు పారితే..
కోట్‌పల్లి జలాశయం జలకళతో కళకళలాడుతోంది. నీటి మట్టం 22 అడుగులకు చేరింది. మరో రెండు అడుగుల నీరు చేరితే అలుగు పారనుంది. ఇదే జరిగితే ఆ నీరంతా మన్‌సాన్‌పల్లి వాగులోకి చేరుతుంది. నిత్యం అవస్థలు తప్పవు. హైదరాబాద్ మార్గంలో కొన్ని రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. పెద్దేముల్ మీదుగా దారి మళ్లించినా నాగసమందర్ సమీపంలో ప్రాజెక్టు అలుగు వద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. అక్కడి వంతెన 2016లో పూర్తిగా ధ్వంసమైంది. ప్రాజెక్టు నిండగానే రాకపోకలు నిలిచిపోనున్నాయి.
ఇప్పుడు ఏమీ చేయలేం
మన్‌సాన్‌పల్లి వాగులో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అలుగు నీరు పారితే పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఏమి చేయలేం. మరో రెండు నెలల తర్వాత పనులు చేపట్టాల్సి ఉంటుంది.
- శ్రీనివాస్, డీఈఈ, అర్‌అండ్‌బీ, తాండూరు
ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల