వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన "మన ఊరు మన పోరు" కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎంపీ రంజిత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సభలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాపై అవగాహనారహితంగా మాట్లాడారని.. మర్యాదలేకుండా విమర్శలు చేశారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు రేవంత్ రెడ్డి మానుకోవాలని హెచ్చరించారు. ఆరోపణలు చేసే ముందు వాటికి ఆధారాలు చూపించాలని అన్నారు. పౌల్ట్రీ వ్యాపారం చేస్తే తప్పా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
"నేను గుడ్ల వ్యాపారం చేస్తే తప్పా. ప్రజా సేవా చేస్తున్నా. చేతనైతే చేవెళ్ల నుంచి పోటీ చేద్దాం రా.. నువ్వానేనా తేల్సుకుందాం. అంతేకానీ.. వ్యక్తిగత విమర్శలు సరికాదు. వరి కొనుగోలు కోసం కేంద్రంతో మేమంతా పోరాటం చేస్తే.. మాతో వచ్చి పోరాటం చేయటం చేతకాలేదు. చేతనైతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం జాతీయ హోదా కోసం పార్లమెంటులో తమతో పాటు పోరాడాలి. ఇప్పటికైనా వ్యక్తి గత విమర్శలు మానుకో." - రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ
గుడి మాన్యాలు ఎక్కడున్నాయో చెబితే..
ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిపై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గుడి మాన్యాలు ఎక్కడున్నాయో చెబితే అవి తమకే ఇస్తానని రేవంత్‌రెడ్డిని అడిగారు. జిల్లాపై ఎలాంటి అవగాహన లేకుండా.. కేవలం విమర్శలు చేయడానికే వచ్చారని ఎద్దేవా చేశారు.
"పాలమూరు-రంగారెడ్డి 60శాతం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో పనులు పూర్తవుతాయి. 2007 నుంచి 2014 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని.. అప్పుడు ప్రాజెక్టులను గాలికొదిలేసి ఇప్పుడు ఏ ముఖంతో అడుగుతున్నారు. మీరు మధ్యలో వదిలేసిన ప్రాజెక్టును సైతం మా ప్రభుత్వం పూర్తి చేసింది. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు. పనులపై చర్చకు రావాలి." - ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
ఇదీ చూడండి: