త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతును గెలిపించుకోవాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు కోరారు. వికారాబాద్‌లోని క్లబ్ హాల్లో "ఎమ్మెల్సీ ఓటర్లతో ముఖాముఖి" కార్యక్రమం నిర్వహించారు. ప్రశ్నించే గొంతుకలు లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి నాగేశ్వర్ తెలిపారు.
ఏదైనా ప్రశ్నతోనే మొదలవుతుందని...పెద్దల సభకు ప్రశ్నించే వారినే పంపించాలని కోరారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. నిరుద్యోగ సమస్యతో పాటు ప్రజల సమస్యలపై పోరాడే అవకాశం మరోసారి తనకు కల్పించాలని కోరారు.