ప్రపంచానికే భారతదేశం ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యార్థి కృషిచేయాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని సబిత అన్నారు. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు కావాలని ఆమె ఆకాంక్షించారు. సుస్థిర అభివృద్ధి, వ్యవసాయం, పర్యావరణం, రవాణా వ్యవస్థపై తమ ఆలోచనలను ప్రదర్శించాలని విద్యార్థులకు సూచించారు.
సైన్స్ ల్యాబ్‌లకు రూ. 40 కోట్లు..
ప్లాస్టిక్ వినియోగంతో ఎదురయ్యే పరిణామాలను విద్యార్థులే వారి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని 411 పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటుచేసేందుకు రూ. 40 కోట్లు నిధులు విడుదల చేసినట్లు మంత్రి సబిత వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1544 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య, కలెక్టర్ ఆయేషా, జిల్లా విద్యాధికారి రేణుకదేవి హాజరయ్యారు.
ఇవీచూడండి: అయ్యప్ప మాల ధరించాడని ఎండలో నిల్చోబెట్టారు