వికారాబాద్ జిల్లావ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 553 గ్రామపంచాయతీల్లో మొక్కలు నాటేందుకు నర్సరీలు ఏర్పాటు చేశారు. వీటిలో పెంచే మొక్కలను జంతువుల బారి నుంచి రక్షించేందుకు కంచె ఏర్పాటు చేయమని ప్రభుత్వం సూచించింది. కంచెను గ్రామ సర్పంచులు ఏర్పాటు చేసుకోగా గేటును మాత్రం పక్క జిల్లాల నుంచి తయారు చేయించి అధికారులు సరఫరా చేశారు.
నాణ్యతపై ఆరోపణలు
గేటు నాణ్యతలో అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నర్సరీలకు బిగించిన గేట్లు స్థానికంగా తయారుచేసే అవకాశమున్నా నిజామాబాద్, హైదరాబాద్లో తయారు చేయించడం చర్చనీయాంశంగా మారింది. తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామ సెక్రటరీలపై ఒత్తిడి తెచ్చి పంచాయతీ 14 వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 14 వేల రూపాయలు నేరుగా సదరు కంపెనీలకు చెక్కుల రూపేనా అందించారని గ్రామ సర్పంచులు ఆరోపిస్తున్నారు.
రూ.14 వేలకు కొంటున్నారు
6, 7 వేల రూపాయల్లో తయారయ్యే గేటుకు రూ.14 వేలు వెచ్చించడం ఏంటని అధికారులను సర్పంచ్లు నిలదీశారు. కొంతమంది తామే సొంతంగా అంతకంటే మంచి నాణ్యతతో గేట్లు తయారు చేయించామని... వాటికి రూ.8 వేలు మాత్రమే ఖర్చయిందని చెబుతున్నారు.
రూ.40 లక్షల అవినీతి
గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన నిధులు దుర్వినియోగం చేయడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 553 గ్రామాల్లో నర్సరీ గేట్ల ఏర్పాటుకు దాదాపు 77 లక్షల రూపాయలు ఖర్చు చేయగా...అధికారులు అధిక ధరలకు గేట్లు చేయించడం వల్ల 40 లక్షల రూపాయల అవినీతి జరిగిందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆయన హస్తమూ ఉంది
ఈ అవినీతిలో అధికారులతో పాటు జిల్లా గత కలెక్టర్ హస్తముందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఈ నెల 27 న ప్రస్తుత కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించకపోవడం వల్ల ఇదే విషయమై తగిన విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్లోని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఒక వేళ న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వ్యవసాయ కార్మిక సంఘం హెచ్చరించింది.
- ఇదీ చూడండి: కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం