కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ బీమా యోజన పథకం రైతులకు చేరకుండా తెరాస ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు వికారాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు సదానంద రెడ్డి. మోదీకి, భాజపాకు మంచి పేరు వస్తుందని.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందని తెరాస ప్రభుత్వం కావాలనే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరకుండా చేస్తుందన్నారు.
పరిగి నియోజకవర్గంలో భాజపా జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, మాజీ అధ్యక్షులు కరణం ప్రహ్లాద రావు కలసి పలు గ్రామాల్లో పర్యటించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున ఎవరు వచ్చి తమను ఊరడించలేదని.. ధైర్యం చెప్పలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం కింద తక్షణమే ఆర్థిక సహాయం చేయాలన్నారు అలాగే వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గణపురం వెంకటయ్య, మండల అధ్యక్షుడు మహిపాల్ పెంటయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ఓ వైపు వర్షం... మరో వైపు అంధకారం... నగరవాసుల ఇక్కట్ల పర్వం