Hyderabad Police Action To Catch Ganja Smuggler Neetu Bai : గంజాయి క్వీన్ నీతూబాయి మత్తు దందా వెనుక కొందరి అధికారుల హస్తం బయటపడుతోంది. అడిగినంత ఇస్తే, ఎంత విక్రయించినా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఆబ్కారీ శాఖలో ఓ ఇన్స్‌స్పెక్టర్, కొందరు ఎస్సైల ఆమ్యామ్యాల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. వీరు నిందితురాలు నీతూబాయితో ఒప్పందం చేసుకుని నెలవారీగా వసూళ్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రోజూ రూ.లక్షల్లో విక్రయాలు చేస్తున్న నీతూబాయి కోసం ఆబ్కారీ శాఖ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆమె ఈ స్థాయిలో దందా చేయడానికి కారణాలేమిటని అధికారులు ఆరా తీయగా ఈ వసూళ్ల వ్యవహారం బయటపడింది.
అడిగినంత ఇస్తే నో చెకింగ్ : నీతూబాయి దాదాపు ఎనిమిదేళ్లుగా గంజాయి విక్రయాలు చేస్తోంది. ఇప్పటికే ఆమెపై పీడీయాక్టు నమోదు చేసినా మళ్లీ దందా చేసేందుకు ఆబ్కారీ శాఖలో కొందరు ఇన్‌స్పెక్టర్ల తీరే కారణమని తెలుస్తోంది. గతంలో ఓ ఇన్‌స్పెక్టర్ నెలకు రూ.లక్ష తీసుకుని చూసీచూడనట్లు వదిలేసేవారని, ఉన్నతాధికారులు నుంచి ఒత్తిడి పెరిగితే కేసు నమోదు చేసేవారని సమాచారం. అయితే అతను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అక్కడికి మరో ఇన్‌స్పెక్టర్ రాగా ఏకంగా రూ. లక్షన్నర ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. వారు చూసిచూడనట్లు వదిలేయాలి అంటే ఈ మొత్తం ప్రతినెలా చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నారు.
బైక్‌పై లిఫ్ట్ ఇస్తే.. నకిలీ పోలీసుతో గంజాయి కేసులో ఇరికిస్తామని బెదిరింపు
అయితే కొందరు ఎస్సైలకు నెలకు రూ.50వేల చొప్పున అందుతున్నట్లు తెలిసింది. వీరి ప్రోద్బలంతో మత్తు దందా చేస్తున్న నీతూబాయిపై ఏడాది కాలంలో ఒకే ఒక్క కేసు నమోదు చేసినట్లు సమాచారం. అదీ కేవలం 1.25 కిలోల గంజాయి దొరికిందని, తీవ్రత లేని కేసుగా నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె చిక్కితే అవినీతి చేపల సంగతి బయటపడుతుందని ఓ అధికారి చెప్పారు.
అవసరమైనే ఆపరేషన్ ధూల్‌పేట్ బృందం రంగంలోకి : రోజూ కిలోలకొద్దీ గంజాయి విక్రయిస్తూ పరారీలో ఉన్న నీతూబాయిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాల్సిందేనని అబ్కారీ శాఖ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు రాష్ట్ర, జిల్లా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలతో గురువారం ఉదయం ప్రత్యేకంగా సమీక్షించారు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకోవాల్సిందేనని, లేకపోతే ఆపరేషన్ ధూల్‌పేట బృందాన్ని రంగంలోని దింపుతామని స్పష్టం చేసినట్లు సమాచారం.
3 నెలలు తర్వాత చిక్కిన 'పుష్ప రాణి' - ఇంతకీ ఎవరీ అంగూరీ బాయి