AIG Hospital Introduce Pillbot Robotic Capsule for Endoscopy : తలనొప్పి లేదా జ్వరమో వస్తే ఓ చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటాం. అంతే పరిమాణంలో ఉండే ఓ క్యాప్సూల్‌తో క్లిష్టమైన ఎండోస్కోపీ పరీక్షలు చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ క్యాప్సూల్‌ను గోలీలా మింగితే అందులో ఉన్న చిన్న కెమెరా, బుల్లిరోబో శరీరంలోని జీర్ణాశయం నుంచి అన్ని మూలల్లోకి వెళ్లి జీర్ణాశయాంతర వ్యవస్థను పరిశీలిస్తుంది. అంతేకాకుండా పరిశీలన చేస్తున్న సమయంలో అధిక రిజల్యూషన్ చిత్రాలను, వీడియోలను రిమోట్‌తో అనుసంధానం చేసిన కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దీంతో కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేయడానికి వైద్యులకు అవకాశం లభిస్తుంది. రోబోటిక్ క్యాప్సూల్‌ను అమెరికాలోని వైద్య ఆవిష్కరణ సంస్థ ఇండియాటెక్స్.. అక్కడి మయో క్లినిక్స్‌తో సంయుక్తంగా అందుబాటులోకి తెచ్చింది.
ఈ క్యాప్సూల్‌ను పిల్‌బోట్‌గా పిలుస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షలు చేస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. గురువారం ఏఐజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, ఇండియాటెక్స్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అలెక్స్ లూబ్కే, మయో క్లినిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వివేక్ కుంభారి, ఏఐజీ వైద్యులు పాల్గొని క్యాప్సూల్ వివరాలను తెలిపారు. ఈ రోబో క్యాప్సూల్ ఎండోస్కోపీకి ఎలాంటి వైర్లు ఉండవని, రిమోట్‌తో కంప్యూటర్ మానిటర్‌కు అనుసంధానమై ఉంటుందని వెల్లడించారు. రోగికి మత్తు ఇవ్వకుండా..నొప్పి లేకుండానే ఈ పరీక్ష చేయవచ్చని తెలిపారు. అనంతరం ఈ క్యాప్సూల్ రోగి మలవిసర్జనలో బయటకు పోతుందని వివరించారు. ప్రస్తుతం ఈ క్యాప్సూల్ 1.8 గ్రాముల బరువు ఉందని, భవిష్యత్తులో దీని బరువు తగ్గించేలా కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు.
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు : ప్రస్తుతం ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ పరీక్షకు దాదాపు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. త్వరలోనే అత్యాధునిక రిమోట్ కంట్రోల్డ్ రోబోటిక్ క్యాప్సూల్‌తో ఈ టెస్టుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల లోపే అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పేషెంట్ ఎంత దూరంలో ఉన్నా వీటిని మింగించిన వైద్యుడు ఇంటర్‌నెట్ ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఈ సరికొత్త ఎండోస్కోపీ పరీక్షను వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
పేగుల్లో క్యాన్సర్ కణతులు, అల్సర్లకు సైతం : ఎండోస్కోపీ పరీక్షలే కాకుండా పేగుల్లో క్యాన్సర్ కణతులు, అల్సర్లకు సైతం క్యాప్సూల్‌లో ఉండే చిన్న రోబో చికిత్సలు చేస్తుందని ఇండియాటెక్స్ సహ వ్యవస్థాపకులు డాక్టర్ అలెక్స్ లూబ్కే తెలిపారు. అంతర్గత రక్తస్రావం జరగకుండా అరికట్టేందుకు వీలుందని వివరించారు. ఈ క్యాప్సూల్ సేకరించిన పూర్తి డేటాను ఏఐతో విశ్లేషించి జీర్ణవ్యవస్థలోని అనారోగ్య పరిస్థితిని పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి వీలవుతుందని చెప్పారు.
బెంగళూరు డాక్టర్లు చేతులెత్తేస్తే - అనంతపురం డాక్టర్లు ప్రాణం నిలిపారు - Rare Surgery to Pancreas
ఫ్యాటీ లివర్ సైలెంట్ కిల్లర్.. గుర్తించకపోతే డేంజర్: డా.నాగేశ్వర్ రెడ్డి