AR Constable Commits Suicide : జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడి పోలీస్ కొలువు సాధించాడు ఆ యువకుడు. కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. తమ కష్టాలు తీరినట్టే అని కన్నవారు ఎంతో సంతోషించారు. ఇక కుమారుడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే తమ బరువు బాధ్యతలు తీరుతాయనుకున్నారు. ఆ యువకుడు కూడా వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతితో అతనికి నిశ్చితార్థం అయింది. ఇంతలో అమ్మాయి వారికి యువకుడి ప్రేమ వ్యవహారం తెలిసింది. దాంతో తమను మోసం చేశాడని భావించిన వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడు అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదని రాజీ కుదుర్చుకున్నాడు. కట్ చేస్తే ఇవాళ ఉదయం పొలంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్ గ్రామానికి చెందిన వెంకటేష్ (30) అనే యువకుడు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఎంపీ సెక్షన్లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో వారు అతనికి పెళ్లి చేయాలనుకున్నారు. దాంతో వెంకటేష్‌కి షాద్‌నగర్‌కు చెందిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. అతను గత మూడు రోజుల క్రితం గచ్చిబౌలి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో అమ్మాయి కుటుంబసభ్యులకు ఆ యువకుడి ప్రేమ వ్యవహారం తెలిసింది. దాంతో మేనత్త కూతురితో ప్రేమ వ్యవహారం నడుపుతూ తమ కూతురితో వివాహానికి సిద్ధమయ్యాడని ఆగ్రహించిన వారు.. తమను మోసం చేశాడని షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అప్పుడు ఆ యువకుడు ప్రేమించిన అమ్మాయితో తనకు ఎటువంటి సంబంధం లేదని షాద్‌నగర్ పీఎస్‌లో రాజీ కుదుర్చుకున్నాడు. అలాగే తర్వాత రోజు మేనత్త కూతురుని, ఆమె కుటుంబసభ్యులని పిలిపించి పెద్దల సమక్షంలో... తనకు, ఆ అమ్మాయి(మేనత్త కూతురు)కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని బాండ్ పేపర్ కూడా రాయించుకొన్నాడు వెంకటేష్. తీరా అంతా అయిపోయాక ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈరోజు ఉదయం తన పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దారిన వెళ్లేవారు చూసి గమనించి అతడిని కిందికి దించగా అప్పటికే వెంకటేష్ మృతి చెందాడు. చేతికొచ్చిన కొడుకు తమ కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: