బతుకమ్మ పండుగ(Bathukamma festival) వచ్చిందంటే ప్రతి ఇంట్లో సందడే సందడి. ఆ ఇంట్లోన ఆయేడు అంతా సంబురమే. బతుకమ్మ పేర్చడానికి కావాల్సిన పూలు తీసుకురావడానికి ఉదయాన్నే భర్త బయటకు వెళ్లాడు. అతను వచ్చేలోగా ఆమె ఇళ్లంతా శుభ్రం చేసి.. బతుకమ్మ పేర్చడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. గునుగు పూలు, పట్టుకుచ్చులు, తంగెడుపూలు, గోరింట, గులాబీ, బంతి ఇలా అన్ని పూలు కోసిన అతను.. ఈయేడు పెద్ద బతుకమ్మను పేర్చుదామనే ఆశతో టేకు పూలు కోద్దామనుకున్నాడు. టేకు చెట్టెక్కి.. పూలు కోసే సమయంలో ప్రమాదవ శాత్తు కిందపడ్డాడు. ఇంటి వద్ద భర్త కోసం వేచి చూస్తున్న భార్యకు ఈ విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స చేసిన వైద్యులు వెన్నెముకకు తీవ్రగాయాలు అవ్వడం వల్ల అతను నడవలేడని చెప్పారు. అప్పటి నుంచి భర్త బాధ్యతను, కుటుంబ పోషణను తన భుజాలపై ఎత్తుకుంది ఆ మహిళ.
సూర్యాపేట మండలం కాసరాబాద్ పంచాయతీ పరిధిలోని ఎదుర్లవారిగూడెం గ్రామానికి చెందిన లింగంపల్లి రాజు, యశోద దంపతులు. వారికి ఒక కుమార్తె. పెయింటింగ్ పనితో కుటుంబాన్ని పోషించే రాజు 11 ఏళ్లకిందట ప్రమాదంలో గాయపడ్డాడు. ఎంగిలి పూల బతుకమ్మ(Bathukamma festival) రోజు టేకు పూల కోసం చెట్టుఎక్కి ప్రమాదవశాత్తు కింద పడటంతో అతడి వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి. స్థోమత లేకపోయినా, యశోద అప్పు చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించింది. అయినా ఫలితం లేక... అతడు మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచీ కుటుంబంతో పాటు...భర్త బాధ్యతనూ యశోద్ తన భుజాలపైకి ఎత్తుకుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా కనీసం 3 చక్రాల బండి కూడా దక్కలేదు. అతడి మందులు, కుటుంబ పోషణ కోసం ఆమె అష్టకష్టాలు పడుతోంది. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుతోంది.
ఏ బతుకమ్మ సంబురం(Women prays to Bathukamma) చేసుకోవడానికైతే తన భర్త చెట్టెక్కి గాయపడ్డాడో.. ఆ బతుకమ్మనే తన భర్తను ఆరోగ్యంగా తిరిగి ఇవ్వమని కోరుతోంది ఆ మహిళ. ఇది జరిగి 11 ఏళ్లు గడిచింది. ఇప్పటికీ ఆ కుటుంబం ఆ ప్రమాదం నుంచి తేరుకోలేదు. ప్రతి ఏటా బతుకమ్మను పేర్చి ఆ మహిళ కోరేది ఒక్కటే తన భర్త ఆరోగ్యం తిరిగిరావాలని. తన కుటుంబంలో ఎప్పటిలాగే సంతోషం వెల్లివిరియాలని. ఆమె కోరిక తీరాలని మనమూ బతుకమ్మను(Women prays to Bathukamma) వేడుకుందాం...
- ఇదీ చదవండి : కదులుతున్న రైలులో యువతిపై సామూహిక అత్యాచారం