కరోనా కేసులతో సంచలనంగా మారిన సూర్యాపేటలో జిల్లా అధికార యంత్రాంగం లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నది. ఇక్కడి కూరగాయల మార్కెట్ నుంచి జిల్లా వ్యాప్తంగా కరోనా విస్తరించడం వల్ల జన సమూహంగా ఉండే ప్రాంతాలను విభజించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఒక్క చోట ఉన్న కూరగాయల మార్కెట్‌ను మొత్తం 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మార్కెట్లను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా యంత్రాంగం కృషితో కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేశామని అన్నారు. లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేసినా.. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసరాలు, కూరగాయలు తెరిచి ఉంచామని తెలిపారు.
లాక్డౌన్ ఎత్తివేసినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.