పింఛను కోసం రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసినా ఇంకా మంజూరు కాలేదని దివ్యాంగుడు మామిడి విజయ్ వాపోయారు. తనకు ధ్రువీకరణ పత్రం ఉన్నా పింఛను రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన మామిడి విజయ్... పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. మూడేళ్ల క్రితం భవన నిర్మాణం పని చేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడటంతో రెండు కాళ్లు, నడుములు చచ్చుపడి పోయాయి. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. చికిత్స కోసం తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేక ఊళ్లో ఉన్న కొద్ది పొలాన్ని అమ్మేశారు. కాళ్లు నడవడానికి సహకరించకపోవటంతో ఎటు వెళ్లాలన్నా ఇద్దరు మనుషులు ఎత్తుకుని వెళ్తే తప్ప కదిలే పరిస్థితి లేదు.
'ఆదుకోండి'
కుటుంబం గడవడానికి భార్య కూలీ పనికి వెళ్తుంది. పింఛను కోసం దరఖాస్తు చేసి రెండేళ్లు దాటి పోయిందని బాధితుడు అన్నారు. ఇంతవరకు మంజూరు కాలేదని వాపోయారు. ఎంపీడీవో, తహసీల్దారు, జేసీ, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూ పింఛను ఇప్పించాలంటూ వేడుకున్నానని... అయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమందికి తన గోడును వినిపించినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి తనకు పింఛను మంజూరు చేసి... తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: వారెవ్వా ఇక్రామ్.. చేతుల్లేకపోయినా ఆడేస్తున్నాడు